Guntur Kaaram Second Song: గుంటూరు కారం రెండో పాట అప్‍డేట్‍పై నిర్మాత ట్వీట్.. ఎప్పుడు రావొచ్చంటే!
Guntur Kaaram Second Song: గుంటూరు కారం మూవీ రెండో పాట గురించి నిర్మాత నాగవంశీ హింట్ ఇచ్చారు. అప్‍డేట్ ఎప్పుడు వస్తుందో ట్వీట్ చేశారు.
Guntur Kaaram Second Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం నుంచి ఇటీవలే వచ్చిన ‘దమ్ మసాలా’ పాటకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా, గుంటూరు కారం నుంచి రెండో పాట కూడా రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
తన ఎక్స్‌ట్రా-ఆర్డినరీ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించకపోతే టికెట్ డబ్బులను వంశీ తిరిగి ఇచ్చేస్తారని హీరో నితిన్ ఇటీవల ఓ ఈవెంట్లో సరదాగా అన్నారు. మ్యాడ్ సినిమా సమయంలో నాగవంశీ చేసిన కామెంట్లను గుర్తుచేసేలా నితిన్ మాట్లాడారు. దీంతో ఆ వీడియోకు సోషల్ మీడియాలో నాగవంశీ స్పందించారు. అప్పుడేదో అనేశానని రిప్లే ఇచ్చారు. దీనికి నితిన్ మళ్లీ స్పందించారు. గుంటూరు కారం రెండో పాట కోసం ఎదురుచూస్తున్నామని, ఇంతకి అప్‍డేట్ ఎప్పుడు అని నాగవంశీని ప్రశ్నించారు. నితిన్ క్వశ్చన్‍కు ఆయన ఆన్సర్ ఇచ్చారు.
గుంటూరు కారం రెండో పాట పనులు జరుగుతున్నాయని నాగవంశీ ట్వీట్ చేశారు. ఇంకో రెండు రోజుల్లో ఈ సాంగ్ గురించి సూపర్ అనౌన్స్‌మెంట్ ఇస్తామని చెప్పేశారు. దీంతో గుంటూరు కారం రెండో పాట గురించి మరో రెండు రోజుల్లో అప్‍డేట్ వచ్చే అవకాశం ఉందని నాగవంశీ హింట్ ఇచ్చారు. డిసెంబర్ 8న సాంగ్ రిలీజ్ అవొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.
గుంటూరు కారం చిత్రం నుంచి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సాంగ్ నవంబర్ 7న వచ్చింది. మాస్ బీట్‍తో ఉన్న ఈ సాంగ్ మంచి పాపులర్ అయింది. మంచి జోష్ ఉన్న ట్యూన్‍ను ఈ పాటకు థమన్ అందించారు. దీంతో రెండో పాట ఎలా ఉంటుందోనని మహేశ్ ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. ఇది మెలోడీగా ఉంటుందని టాక్.
గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. హారిక, హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో మూడో మూవీగా గుంటూరు కారం వస్తోంది.
సంబంధిత కథనం