OTT Releases: ఈ నెలలో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన తెలుగు సినిమాలు ఇవే.. మీరు చూశారా!-guntur kaaram pindam to naa saami ranga top telugu movies ott releases in february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఈ నెలలో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన తెలుగు సినిమాలు ఇవే.. మీరు చూశారా!

OTT Releases: ఈ నెలలో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన తెలుగు సినిమాలు ఇవే.. మీరు చూశారా!

Telugu Movies OTT Releases in February: ఫిబ్రవరిలో కొన్ని బడా తెలుగు సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. ఆ చిత్రాలు ఏఏ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

OTT Releases: ఈ నెలలో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన తెలుగు సినిమాలు ఇవే

OTT Releases: ఈ ఏడాది జనవరిలో హాయ్ నాన్న, సలార్, యానిమల్‍ సహా మరిన్ని హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ప్రేక్షకులను అలరించాయి. ఈనెల (ఫిబ్రవరి)లోనూ చాలా తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‍లో థియేటర్లలో రిలీజైన మూడు చిత్రాలతో పాటు మరిన్ని ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి అడుగుపెట్టేశాయి. ఈనెలలో ఇప్పటి వరకు ఓటీటీల్లోకి వచ్చిన ముఖ్యమైన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్‍లో థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఉండగా.. రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో గుంటూరు కారం స్ట్రీమింగ్ అవుతోంది.

సైంధవ్

శైలేశ్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. సైంధవ్ సినిమా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది.

నా సామిరంగ

కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతికే రిలీజై మంచి హిట్ అయింది. కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీరోల్స్ చేశారు. నా సామిరంగ చిత్రం ఫిబ్రవరి 17వ తేదీన ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.

పిండం

హారర్ సినిమా పిండం గత డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సాయి కిరణ్ దైడా దర్శకత్వంలో అత్యంత భయానక మూవీ అంటూ వచ్చింది. ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 2వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ సాయిరామ్, ఖుషీ రవి, శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించారు.

బబుల్‍గమ్

ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమైన బబుల్‍గమ్ సినిమా డిసెంబర్లో రిలీజై అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న 'ఆహా' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. రవికాంత్ పేరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోషన్ సరసన మానసా చౌదరి హీరోయిన్‍గా నటించారు.

భామాకలాపం 2

'ఆహా' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి భామాకలాపం 2 సినిమా ఫిబ్రవరి 16వ తేదీన నేరుగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. రెండేళ్ల కిందట వచ్చిన భామాకలాపం మూవీకి సీక్వెల్‍గా ఇప్పుడు భామాకలాపం 2 వచ్చింది.

డబ్బింగ్‍లో ఇవి

తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ డ్రామా కెప్టెన్ మిల్లర్ ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమ్ అవుతోంది. వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ చిత్రం జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రం కూడా తెలుగు ఆడియోలో అందుబాటులో ఉంది. మమ్ముట్టి మలయాళం సినిమా మలైకొట్టై వాలిబన్ కూడా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చింది.