Guntur Kaaram Box Office Collections day 4: గుంటూరు కారం బాక్సాఫీస్ కలెక్షన్లు.. అల వైకుంఠపురంలో రికార్డు బ్రేకవుతుందా?
Guntur Kaaram Box Office Collections day 4: మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. అల వైకుంఠపురంలో మూవీ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Guntur Kaaram Box Office Collections day 4: గుంటూరు కారం మూవీకి తొలి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దూసుకెళ్తూనే ఉంది. 4 రోజుల్లోనే రూ.200 కోట్లకు చేరువై.. అల వైకుంఠపురంలో రికార్డును బ్రేక్ చేయడానికి చేరువవుతోంది. తొలి వారం అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ సినిమాగా నిలిచే దిశగా వెళ్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ ఊహించిన రేంజ్ లో లేదు. కేవలం ఫ్యాన్స్ ను మాత్రమే మాస్ మసాలాతో ఉర్రూతలూగించింది. న్యూట్రల్ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. అయినా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూడు రోజుల్లోనే రూ.164 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ.. సంక్రాంతి పండగ రోజు మరింత చెలరేగిపోయింది.
గుంటూరు కారం.. రూ.200 కోట్ల చేరువలో..
గత శుక్రవారం (జనవరి 12) రిలీజైన గుంటూరు కారం మూవీకి హనుమాన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ కు చేరువవుతోంది. సంక్రాంతి రోజు ఈ సినిమా ఇండియాలోనే రూ.14.5 కోట్లు వసూలు చేసింది. కేవలం తెలుగులోనే రిలీజైన ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు మామూలు విషయం కాదు.
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన గుంటూరు కారం.. తర్వాత నెగటివ్ టాక్ తో కాస్త తగ్గింది. అయినా కూడా తర్వాతి మూడు రోజుల్లో నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. మంగళవారం (జనవరి 16) కూడా తెలుగు రాష్ట్రాల్లో హాలీడే కావడంతో ఐదో రోజు కూడా మంచి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అల వైకుంఠపురంలో రికార్డు బ్రేకవుతుందా?
ఇప్పటి వరకూ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ సాధించిన ప్రాంతీయ సినిమాగా అల వైకుంఠపురంలో నిలిచింది. ఈ సినిమా తొలి వారంలోనే రూ.107 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం గుంటూరు కారం షేర్ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.87 కోట్లుగా ఉంది. తర్వాత మూడు రోజుల్లో రూ.20 కోట్లకుపైగా వసూలు చేయడం సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి.
కనుమ రోజు కూడా ఈ మూవీ దూకుడు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రికార్డుకు మరింత చేరువ కానుంది. తొలి రోజే రూ.53 కోట్ల షేర్ తో మొదలు పెట్టినా.. తర్వాత నెమ్మదించింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉన్నా.. ఇప్పటికే ఆ రికార్డు బ్రేక్ అయి ఉండేది. అయితే మూవీ టీమ్ మాత్రం ఈ కలెక్షన్లతో సంబంధం లేకుండా బ్లాక్‌బస్టర్ సంబరాలు చేసుకుంది. సంక్రాంతి రోజు మహేష్ బాబు తన ఇంట్లో టీమ్ కు పార్టీ ఇచ్చాడు.
ఈ సక్సెస్ పార్టీకి గుంటూరు కారం హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరితోపాటు నిర్మాత నాగవంశీ, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వచ్చారు. వీళ్లతో మహేష్, నమ్రతా దంపతులు ఫొటోలకు పోజులిచ్చారు.