Guns and Gulaabs sequel: దుల్కర్ సల్మాన్ గన్స్ అండ్ గులాబ్స్ రెండో సీజన్ వచ్చేస్తోంది
Guns and Gulaabs sequel: మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన తొలి వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ సీక్వెల్ వచ్చేస్తోంది. గురువారం (డిసెంబర్ 28) ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా నెట్‌ఫ్లిక్స్ ఈ సీక్వెల్ అనౌన్స్ చేసింది.

Guns and Gulaabs sequel: ప్రముఖ తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ మరోసారి అభిమానులను అలరించడానికి సీక్వెల్ తో వస్తోంది. మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ తోపాటు రాజ్‌కుమార్ రావ్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ నటించిన ఈ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే గన్స్ అండ్ గులాబ్స్ రెండో సీజన్‌ను మరింత గొప్పగా, ఆసక్తికరంగా తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ కొత్త సీజన్ అనౌన్స్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ టీజర్ రిలీజ్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఓటీటీ పోస్ట్ చేసింది. "ఉత్త చేతులతో రాలేదు. గన్స్ అండ్ గులాబ్స్ కొత్త సీజన్ తీసుకొచ్చాం. గన్స్ అండ్ గులాబ్స్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ లో రానుంది" అనే క్యాప్షన్ తో ఈ సీజన్ 2ను అనౌన్స్ చేసింది.
ఈ వీడియోలో వెబ్ సిరీస్ లోని ముఖ్యపాత్రలైన పానా టిప్పు (రాజ్‌కుమార్ రావ్), నార్కోటిక్స్ ఆఫీసర్ అర్జున్ (దుల్కర్ సల్మాన్), చార్ కట్ ఆత్మారాం (గుల్షన్ దేవయ్య), జుగ్ను గాంచి (ఆదర్శ్ గౌరవ్), సతీష్ కౌశిక్ (గాంచీ)ల గ్రాఫిక్ క్లిప్ చూపించారు. బద్లా భీ ముజ్‌కో లేనా పడేగా అనే పాట బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. తొలి సీజన్ ను ఇంట్రెస్టింగా ముగించిన మేకర్స్.. రెండో సీజన్ పై అప్పుడే ఆసక్తి రేపారు.
గన్స్ అండ్ గులాబ్స్ రెండో సీజన్ లో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. తొలి సీజన్ చివర్లో అందరూ చనిపోయినట్లు భావించిన ఆత్మారాం ఇంకా బతికే ఉన్నట్లు చూపించడంతోనే మరో సీజన్ రాబోతున్నట్లు ప్రేక్షకులు అంచనా వేశారు. మరి ఈ కొత్త సీజన్ లో ఆత్మారాం చనిపోతాడా? గాంచీ సామ్రాజ్యం ఏమవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.