గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి మాజీ ప్రియుడు వర్ధన్ డబ్బుల గురించి వాయిస్ మెసేజ్ పెడతాడు. అది రోహిణి వింటున్నప్పుడే వచ్చిన ప్రభావతి ఏంటని అడుగుతుంది. దాంతో మలేషియా మావయ్య భార్య గురించి అని కవర్ చేస్తుంది రోహిణి. ఆ తర్వాత ఇద్దరు మీనాకు బాలు తెచ్చిన బంగారం గురించి మాట్లాడుకుంటారు.
3 గ్రాముల బంగారం తెచ్చి కిలో బంగారం తెచ్చినట్లు మీనా ఫీల్ అవుతుందని ప్రభావతి అంటుంది. మీ ఫీల్ అయేంత బంగారం ఏం తీసుకొచ్చాడు పుస్తెలే కదా. ఇన్నిరోజులు ఏమి లేనట్లే ఉన్నారు. ఇంత సడెన్‌గా ఎలా తీసుకొచ్చారు. మీనా షాప్ పెట్టిందిగా. ఎప్పుడు చూసిన కస్టమర్స్ చాలా మందే ఉంటున్నారు. ఆ పూల మీద సంపాదించిన డబ్బే ఇచ్చుంటుంది అని రోహిణి అంటుంది.
బాలు పరువు నిలబెట్టాలని, మనోజ్ కంటే గొప్పవాడు అనుకోవాలని ఇలా చేసి ఉంటుంది అని మీనాను ఇరికిస్తుంది రోహిణి. అంతే అయింటుందిలే. పూలకొట్టు పెట్టిందన్న మాటే గానీ ఇంట్లోకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ల సంగతి వదిలేసేయ్. ఏం లేనిది బంగారం వేసుకుని అంత పొగరు చూపిస్తుంటే నీకు అన్ని నగలు ఉండి కూడా అసలు వేసుకోవేంటమ్మా. నీ నగలన్నీ తీసుకుని వేసుకో అని ప్రభావతి అంటుంది.
దాంతో రోహిణి షాక్ అయిపోతుంది. లేని నగలు ఎక్కడి నుంచి వేసుకునేది. మీనా గురించి చెప్ప అనవసరంగా నేను ఇరుక్కున్నాను. నగల మ్యాటర్ తీయకుండా ఉండాల్సింది అని మనసులో రోహిణి అనుకుంటుంది. నాకు నగలు వేసుకోవడం, నాకే ఉన్నాయని పొగరు చూపించడం, ఆర్భాటాలకు పోవడం ఇష్టముండదు ఆంటీ అని రోహిణి చెబుతుంది. దాంతో ప్రభావతి మురిసిపోతుంది.
నువ్ ఎంత గొప్పదానివమ్మా. ఎన్నో నగలు ఉండి కూడా పొగరు చూపించట్లేదు. ఏం లేని మీనా మాత్రం ఎగిరెగిరి పడుతుంది అని ప్రభావతి అంటుంది. తర్వాత బాలు ఓ చోటికి తీసుకెళ్లాలని చెప్పానుకదా పదండి అని మీనా అంటుంది. ఎక్కడికి అని బాలు అడిగితే.. వెళ్తే తెలుస్తుంది కదా అని చెబుతుంది మీనా. తర్వాత బాలును గుడికి తీసుకెళ్తుంది మీనా. ఇక్కడికి ఎందుకు అని బాలు ప్రశ్నలు వేస్తుంటే ఏం అడగకండి, చెప్పింది చేయమంటుంది మీనా.
గుడిలోకి వెళ్లాక అక్కడ మీనా తల్లి పార్వతి, చెల్లి, తమ్ముడు ఉంటారు. వీళ్లంతా ఇక్కడేం చేస్తున్నారు. నాతో ఏమైనా ప్లాన్ చేశారు. ఎవరిదైనా పెళ్లి చేయించాలా అని బాలు అంటాడు. దానికి అవును.. మన పెళ్లే మళ్లీ చేయించాలి అని మీనా అంటుంది. బాలు అర్థం కానట్లు చూస్తాడు. ముందు అయితే రెడీ అయి రమ్మని చెబుతుంది. అయోమయంగానే బాలు వెళ్లి పంచె కట్టుకుని వస్తాడు.
ఇప్పుడు చెప్పు. మళ్లీ మన పెళ్లి ఏంటీ అని బాలు అడుగుతాడు. మొదటిసారి మనం పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు జీవితాంతం కలిసి బతకాలనే కోరిక బలపడింది. ఇప్పుడు వేయండి మూడు ముళ్లు తలవంచి తాళి కట్టించుకుంటాను అని మీనా చెబుతుంది. దానికి బాలు సంతోషించి ఒప్పుకుంటాడు. బాలు, మీనాలను పెళ్లికొడుకు, పెళ్లికూతురిలా రెడీ చేస్తారు.
తలకు బాసింగాలు కడతారు. పెళ్లి పీటలపై కూర్చుని బాలు, మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మీనాకు బాలు తాళి కడతాడు. పార్వతితోపాటు అక్కడున్న వాళ్లంతా అక్షింతలు వేసి బాలు, మీనాలను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అగ్ని గుండం చుట్టూ బాలు మీనా ఏడు అడుగులు వేస్తారు. మీనాకు అరుంధతి నక్షత్రం అంటూ ఆకాశంలోకి చూపిస్తాడు బాలు. ఈ సీన్ అంతా చూసేందుకు చాలా బాగుంటుంది.
మీనాను మళ్లీ పెళ్లి చేసుకున్న బాలు అలాగే ఇంటికి వెళ్తారు. అది చూసి ప్రభావతి వాళ్లు షాక్ అవుతారు. మళ్లీ పెళ్లి ఏంట్రా అని ప్రభావతి అంటుంది. దాంతో సత్యంకు జరిగింది చెబుతుంది మీనా. మొదటిసారి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి జంటగా మమ్మల్ని ఆశీర్వదించమని మీనా అడుగుతుంది. దానికి సత్యం చాలా సంతోషిస్తాడు.
ప్రభావతి, సత్యం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు బాలు, మీనా. ఆ తర్వాత రోహిణికి వర్ధన్ నుంచి బెదిరింపులు వస్తాయి. డబ్బు ఇవ్వకుంటే ప్రభావతికి నిజం చెప్పేస్తానని బెదిరిస్తాడు. దాంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నానంటే వీడొకడు. వీడికి డబ్బు ఎలా తీసుకొచ్చేది అని రోహిణి ఆలోచిస్తుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం