మౌనిక ముందు బ్యాగ్ తీసుకొచ్చి పెడుతుంది సువర్ణ. ఈ నరకం నుంచి శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోమని అంటుంది. సంజు మారడం అసాధ్యమని చెబుతుంది. సువర్ణ మాటలతో మౌనిక షాకవుతుంది. నేను కూడా ఓ దుర్మార్గుడిని పెళ్లిచేసుకొని ఎన్నో కష్టాలు అనుభవించానని, సంజు కూడా తండ్రిలాగే తయారయ్యాడని అంటుంది. సంజును మర్చిపోయి మరో పెళ్లిచేసుకోమని మౌనికకు సలహా ఇస్తుంది సువర్ణ.
తాను ఇళ్లు వదిలి వెళ్లనని, భర్తను మార్చుకోవడానికి కావాల్సినంత సహనం, ఓర్పు తనకు ఉన్నాయని అత్తయ్యతో అంటుంది మౌనిక. బాలు కూడా మీనాను ఇష్టంలేకుండానే పెళ్లిచేసుకున్నాడని, కానీ ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారని, తన కాపురంలో అలాంటి రోజులు వస్తాయనే ఆశ ఉందని మౌనిక అంటుంది.
తాను ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిన మరుక్షణం సంజును బాలు ప్రాణాలతో ఉండనివ్వడని చెబుతుంది మౌనిక. నా కొడుకు మారుతాడని నేనే నమ్మడం లేదు...కానీ భార్యగా నువ్వు నమ్ముతున్నావు...నీలాంటి భార్య దొరకడం సంజు అదృష్టం అని సువర్ణ అంటుంది.
కిచెన్‌లో వంట చేస్తూ బిజీగా ఉంటుంది మీనా. ఆమె దగ్గరకు వస్తుంది రోహిణి. కొత్త కారు ఎలా కొన్నారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీనాను అడుగుతుంది రోహిణి. పూల మాలల ఆర్డర్ వచ్చింది కదా ఆ డబ్బులతోనే కొన్నామని మీనా బదులిస్తుంది. ఐదు వందల మాలలు కడితేనే అంత డబ్బులు వచ్చాయా? బాలునే ఎక్కడో అప్పు చేసి...నువ్వు ఆ డబ్బులు ఇచ్చినట్లు అబద్ధం చెబుతున్నాడు కదా అని మీనాతో అంటుంది రోహిణి. అబద్ధం చెప్పాల్సిన అవసరం బాలుకు లేదని మీనా గట్టిగా అంటుంది.
అసలు నువ్వు బాలుకు కారు ఎందుకు కొనిచ్చావు...నువ్వు బాలుకు కారు కొనివ్వడం వల్ల నాకు సమస్యగా మారిందని మీనాపై జెలసీగా ఫీలవుతుంది రోహిణి. అసలు నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు...నేను కారు కొనిస్తే నీకు సమస్య ఏంటి అని రోహిణిని నిలదీస్తుంది మీనా.
నువ్వు బాలు ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు...అంతే కాకుండా బాలు మీ తమ్ముడి చేయి కూడా విరగొట్టాడుగా...అయినా కారు ఎందుకు కొనిచ్చావని మీనాను అడుగుతుంది రోహిణి. మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా...అంతకుమించిన ఇష్టం బాలుకునాపై ఉంది అని మీనా సమాధానమిస్తుంది. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు...కానీ ప్రేమానురాగాలు సంపాదించుకోవడం ముఖ్యమని మీనా చెబుతుంది.
అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. రోహిణికి క్లాస్ ఇస్తుంది. భార్యభర్తల పర్సనల్ విషయాలు ఎలా అడుగుతావు...ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయిగా అని రోహిణికి క్లాస్ ఇస్తుంది శృతి. నువ్వు మీనాను చూసి జెలసీగా ఫీలవుతున్నావని అర్థమైందని అంటుంది. తన భర్తకు మీనా కారు కొనిస్తే తప్పేంటి అని అంటుంది.
నువ్వు కూడా నీ భర్త బిజినెస్ పెట్టుకుంటానంటే సహాయం చేయవా అని నిలదీస్తుంది. మీనా పూల మాలలు కట్టి తన భర్తకు కారు కొనివ్వడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ ఈ పిచ్చి ప్రశ్నలు ఏంటి అని దులిపేస్తుంది. శృతి మాటలతో సైలెంట్‌గా అక్కడి నుంచి జారు కుంటుంది రోహిణి.
ప్రభావతి ఇంటికి వస్తుంది శోభన. వచ్చి రాగానే ప్రభావతిపై సెటైర్లు వేస్తుంది. మీరు ఇంటి పనులు ఏం చేయరటగా అని అంటుంది. ఆస్తి మొత్తం శృతి పేరు మీద రాయడానికే శోభన వచ్చిందని ప్రభావతి లోలోన సంబరపడుతుంది. శృతికి నల్ల పూసలు గుచ్చే వేడుకను గ్రాండ్‌గా చేయాలని అనుకుంటున్నట్లు ప్రభావతితో అంటుంది శోభన. శృతితో పాటు రోహిణికి కూడా నల్ల పూసల ఫంక్షన్ జరిపిస్తే బాగుంటుందని ప్రభావతి అంటుంది.
రోహిణికి పెళ్లై చాలా రోజులు అయ్యింది కదా...కూతురు మెడలో పుస్తెల తాడు వేయలేనంత బిజీగా ఉన్నారా వాళ్ల పుట్టింటివాళ్లు అంటూ పంచ్‌లు వేస్తుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ప్రతిసారి తన టాపిక్ రావడం చూసి రోహిణి కంగారు పడుతుంది. రోహిణి, శృతి ఇద్దరికి కలిపే ఫంక్షన్ చేయడానికి శోభన ఒప్పుకుంటుంది.
శోభన వెళ్లిపోగానే...నల్లపూసల ఫంక్షన్‌కు మీ నాన్నను నువ్వు తీసుకురావాల్సిందే...పుస్తెల తాడు తీసుకురావాల్సిందే రోహిణికి ఆర్డర్ వేస్తుంది ప్రభావతి.తన బాధను మొత్తం విద్యతో పంచుకుంటుంది రోహిణి. నల్ల పూసల ఫంక్షన్ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని టెన్షన్ పడుతుంది.
నల్లపూసల ఫంక్షన్‌ను అడ్డుపెట్టుకొని సత్యం ఫ్యామిలీలో గొడవలు సృష్టించాలని శోభన, సురేంద్ర ప్లాన్ చేస్తారు. బాలును రెచ్చగొట్టి రవి, శృతిని తమ ఇంటికి వచ్చేలా చేయాలని అనుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.