తల్లి ప్రభావతి తనను ద్వేషించడం వెనుక ఉన్న గతం గుర్తుచేసుకుంటాడు బాలు. కానీ ఆ నిజం మాత్రం మీనాకు చెప్పడానికి ఇష్టపడడు. కష్టపడని కొడుకును, తండ్రికి ద్రోహం చేసే కొడుకును ప్రేమిస్తుంది. కష్టం వస్తే అండగా నేను ఉన్నానని నిలిచే కొడుకును మాత్రం ప్రభావతి ద్వేషిస్తుంది. దానికి జవాబు మా అమ్మనాన్నల దగ్గర లేదు. నా ప్రశ్నకు చాలా ఏళ్లుగా సమాధానం దొరకలేదని బాలు ఎమోషనల్ అవుతాడు.
చిన్నప్పటి నుంచి ఏది నాకు దక్కలేదని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గడప మీదే కూర్చొని ప్రతి రోజు అమ్మ కోసం ఎదురుచూశానని, ఏదో ఒక రోజు అమ్మ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళుతుందని ఆశతో కూర్చొనేవాడిని. కానీ మా అమ్మ ఎప్పటికీ రాదని అర్థం కావడానికి చాలా కాలం పట్టిందని బాలు అంటాడు.
అమ్మ ఉంది...అమ్మతో నేను ఉన్నాను. తిన్నావా అని ఒక్క మాట అనదు. నా కళ్లు అమ్మ ప్రేమ కోసం ఎదురుచూడటం మానేశాయి. ఈ గుండె మాత్రం ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటుందని బాలు అంటాడు.
బాలు ఎమోషనల్ కావడం చూసి మీనా ఓదార్చుతుంది. కన్నీళ్లతో మీనా ఒడిలో తల పట్టుకొని అలాగే బాలు నిద్రపోతాడు. మీనా, బాలు గొడవపడినట్లు సుశీల కలగంటుంది. కలలో బాలును వదిలేసి మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. ఇంక మీరు మారరు. మీతో కలిసి ఉండలేనని మీనా కోపంగా అంటుంది. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను. ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించు అని మీనాను బతిమిలాడుతాడు బాలు.
మీలాంటి ఆవేశపరుడితో కాపురం చేయలేను. ఇక జీవితంలో మీ ముఖం చూడను అని బాలు వదిలేసి వెళ్లిపోయినట్లుగా సుశీలకు కల వస్తుంది. ఒక్కసారిగా మీనా అని అరుస్తూ నిద్రలో నుంచి మేల్కొంటుంది సుశీల. ఈ కల ఏ అనర్థానికి దారి తీస్తుందోనని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాడని, బాలు కాపురం బాగుండాలని దేవుడిని వేడుకుంటుంది.
బాలు, మీనాలను లోపలికి తీసుకొచ్చి దిష్టితీస్తుంది సుశీల. ఏమైందని, ఎందుకు కంగారు పడుతున్నావని బామ్మను అడుగుతాడు బాలు. ఏదో పీడకల వచ్చిందని, మీరిద్దరు కలకాలం కలిసి మెలిసి ఉండాలని, బాలు, మీనాలతో అంటుంది సుశీల. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని, మీరు మాత్రం ఎప్పుడు విడిపోవద్దని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా మధ్య ఎలాంటి గొడవలు రావని బామ్మకు సర్ధిచెబుతాడు బాలు.
బాలు ఇదివరకటిలా లేడని, తనను ప్రేమగా చూసుకుంటున్నాడని, ఒక్క మాట పడనివ్వడం లేదని మీనా అంటుంది. ఎన్ని గొడవలు జరిగినా కలిసే ఉంటామని సుశీలకు మాటిస్తుంది మీనా.
పల్లెటూరి నుంచి సిటీకి వస్తారు. వచ్చిరావడంతోనే ప్రభావతి పూలకొట్టుకు సెలవు అనే బోర్డ్ చూసి చిందులు తొక్కుతుంది ప్రభావతి. అప్పుడే ఓ కస్టమర్ వచ్చి పూలకొట్టు ఓనర్ ప్రభావతి అని పొరపడి ఆమెపై కోప్పడుతుంది. షాప్ మూసేస్తే మేము ఎంత ఇబ్బంది పడతాం. ఆ మాత్రం బాధ్యత లేదా ఫైర్ అవుతుంది. కస్టమర్ మాటలతో ప్రభావతి కోపం మరింత పెరుగుతుంది. ఈ కొట్టు నువ్వు నేనే పీకిపారిస్తేను అని బోర్డ్ పట్టుకుంటుంది ప్రభావతి.
రేపటి నుంచి షాప్‌ను తప్పకుండా ప్రభావతి తెరుస్తుంది ఆ కస్టమర్‌కు బాలు సర్ధిచెబుతాడు. పూలమ్మే దానికి ఇంత కోపం ఉండకూడదని ప్రభావతిపై ఆ కస్టమర్ సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఈ బోర్డ్ వల్లే తిప్పలు వచ్చాయని పూలకొట్టు బోర్డ్ తీయబోతుంది ప్రభావతి. ఆ బోర్డ్ తీసేస్తే ఇంత కంటే పెద్ద బోర్డ్ రాయిస్తానని, వీధి మొత్తం పాంప్లెంట్స్ పంచిపెడతానని బాలు అంటాడు.
రాగానే ఈ యుద్ధం ఏంటి? ఆ పూల కొట్టు నీకు ఏం అన్యాయం చేసిందని సత్యం అంటాడు. రేపే ఇది ప్రభావతి పూల కొట్టు కాదని బోర్డ్ పెట్టిస్తానని బాలు అంటాడు. అయినా వినకుండా తన పేరును రోడ్డు పాలు చేశావని బాలుపై నిప్పులు చెరుగుతుంది ప్రభావతి. ఊళ్లో అందరూ మంచి ఫ్యామిలీ అని మెచ్చుకున్నారని, కానీ కొట్టుకుచచ్చే ఫ్యామిలీ అని పేరు తీసుకురావద్దని ప్రభావతిపై ఫైర్ అవుతాడు. అయినా ప్రభావతి కోపం తగ్గకపోవడంతో ఆమెను పబ్బీ అని పిలిచి కూల్ చేస్తాడు. అమ్మ వీక్ పాయింట్ పట్టేశావని తండ్రితో అంటాడు బాలు.
పల్లెటూళ్లో తమకు ఎదురైన ఇబ్బందులను ప్రభావతి, మనోజ్, శృతి బయటపెడతారు. తాను మాత్రం సంతోషంగా గడిపానని రవి అంటాడు. మలేషియా మావయ్య రావడం ఒక్కటే సంతోషాన్ని కలిగించిందని ప్రభావతి అంటుంది. అవును రోహిణి మేకమామ సారీ మేనమామ వచ్చాడు కదా అని బాలు అంటాడు.
మా అమ్మ అమెరికా ప్రెసిడెంట్ వచ్చిన అంత మర్యాద చేయలేదు. మీ మావయ్యకు మలేషియాలో బిజినెస్‌లు ఉన్నాయో...మేకల మందలు ఉన్నాయో తెలియదు కదా అని బాలు అంటాడు. అందుకే తెగ మర్యాదలు చేసిందని బాలు అంటాడు. తన మావయ్యను బాలు తక్కువ చేసి మాట్లాడటం రోహిణి సహించలేకపోతుంది.
ఇంకోసారి ఆ పల్లెటూరికి రమ్మనకు అమ్మ...అక్కడ ఏసీ కూడా లేదని మనోజ్ అంటాడు. నీకు నీ భార్యకు బామ్మ ఏం తక్కువ చేసిందని మనోజ్‌పై ఫైర్ అవుతాడు. ఏరు దాటి తెప్ప తగిలేయడం, ఊరు దాటి ప్లేట్ తిరగేయడం నీకు బాగానే తెలుసునని అంటాడు. వాడు నీలాగా ఒంటరిగా పెరగలేదని మనోజ్‌కు సపోర్ట్ చేస్తుంది ప్రభావతి.
అవును ఏ కొడుకు...తల్లిని వదిలేసి ఒంటరిగా పెరగాలని అనుకోవడని బాలు అంటాడు. వాడు మా అమ్మ దగ్గరే పెరిగాడని, బాలు మొండోడు, మొరటోడు కాదని సత్యం అంటాడు. నిజం చెప్పాలంటే వాడే స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగాడు. కల్లకపటం, కల్మషం లేదు కాబట్టే మీ లాంటి వాళ్ల మధ్య ఇమడలేక పోతున్నాడని సత్యం అంటాడు.
బాలు పచ్చితాగుబోతులా పెరిగాడని, పేట రౌడీలా తయారయ్యాడని ప్రభావతి అంటుంది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న మీనా ప్రభావతిపై విరుచుకుపడుతుంది.
ఎందుకు నా భర్తను అన్నేసి మాటలు అంటున్నారు. కన్నది మీరే కదా...ఆయన్ని ఎందుకు అలా ఒంటరిగా వదిలేశారని ఫైర్ అవుతుంది. కొడుకును కఠినంగా చూసే కన్నతల్లిని మిమ్మల్నే చూస్తున్నానని కోప్పడుతుంది. ఓ తల్లిగా మాట్లాడమని అంటుంది.
వాడు మాత్రమే నిజాయితీపరుడు...మేము కాదని అంటున్నావా, ఎందుకు నీకు రోషం పొడుచుకువస్తుందని మీనాపై రివర్స్ కౌంటర్ వేస్తుంది ప్రభావతి. ఇంట్లో మాకంటూ సొంతంగా రూమ్ లేకుండా నీ మొగుడు చేశాడని కోప్పడుతుంది.
పైన ఇంకో రూమ్ కట్టించమని అమ్మ సలహా ఇచ్చిందని సత్యం అంటాడు. ఇంకో రూమ్ కట్టిస్తే మీనాను ఇంట్లో నుంచి పంపించేయడం కుదరదని ప్రభావతి ఆలోచనలో పడుతుంది. మీనా రూమ్‌లోకి వెళ్లబోతుండగా ఆమెను ఆపేస్తుంది ప్రభావతి.
ఎక్కడికే వెళుతున్నావు...ఇన్నాళ్లు బామ్మ అండ చూసుకొని రెచ్చిపోయావు. ఇక్కడ కూడా అలా నడుస్తుందని అనుకోకు. ఇది నా ఇళ్లు అని గుర్తుపెట్టుకో అని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇది నా ఇళ్లు అని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మీనా బదులిస్తుంది.
ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఇళ్లు...నీ మొగుడు ఏం నాకోసం కట్టించలేదని ప్రభావతి అంటుంది. తనకు కాఫీ ఇవ్వమని గొడవ చేస్తుంది. పూల కొట్టు తెరిచిన తర్వాత ఇస్తానని చెప్పిన వినకుండా నానా మాటలు అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం