గార్డియ‌న్ రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక హార‌ర్ మూవీ భ‌య‌పెట్ట‌డం క‌ష్ట‌మే-guardian review hansika horror thriller movie guardian story explained in telugu aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గార్డియ‌న్ రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక హార‌ర్ మూవీ భ‌య‌పెట్ట‌డం క‌ష్ట‌మే

గార్డియ‌న్ రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన‌ హ‌న్సిక హార‌ర్ మూవీ భ‌య‌పెట్ట‌డం క‌ష్ట‌మే

Nelki Naresh HT Telugu

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ గార్డియ‌న్ అదే పేరుతో తెలుగులో డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ హార‌ర్ మూవీకి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గార్డియ‌న్ ఎలా ఉందంటే...

గార్డియ‌న్ రివ్యూ

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన గార్డియ‌న్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళ అనువాదంగా రూపొందిన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

అప‌ర్ణ ప్ర‌తీకారం...

అప‌ర్ణ‌ను (హ‌న్సిక‌) అంద‌రూ అన్‌ల‌క్కీ అప‌ర్ణ అంటూ ఆట‌ప‌ట్టిస్తుంటారు. చిన్న‌త‌నం నుంచి ఆమె కోరుకున్న‌ది ఏది జ‌ర‌గ‌దు. ప్రాణంగా ప్రేమించిన ప్ర‌భ ఆమెకు దూర‌మ‌వుతాడు. అర్కిటెక్చ‌ర్ పూర్తిచేసిన అప‌ర్ణ‌కు ఒక్క జాబ్ రాదు. ప్రాజెక్ట్ వ‌ర్క్‌లో భాగంగా క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఉన్న ఓ బిల్డింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది అప‌ర్ణ‌. అక్క‌డ ఆమెకు అనుకోకుండా ఓ క్రిస్ట‌ల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది.

అప్ప‌టి నుంచి అప‌ర్ణ జీవిత‌మే మారిపోతుంది. అప‌ర్ణ కోరుకున్న‌వ‌న్నీ జ‌రిగిపోతుంటాయి. కే అనే పెద్ద‌ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో జాబ్ వస్తుంది. బ్రేక‌ప్ చెప్పిన ల‌వ‌ర్ ప్ర‌భ కూడా మ‌ళ్లీ అప‌ర్ణ లైఫ్‌లోకి వ‌స్తాడు. త‌మ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌తో పాటు కంపెనీ హెడ్ త‌మ్ముడు చ‌నిపోవాల‌ని అప‌ర్ణ‌ కోరుకుంటుంది. ఆమె క‌ళ్ల ముందే ఇద్ద‌రు దారుణంగా ప్రాణాలు పోగ్గొట్టుకుంటారు.

ఆ త‌ర్వాత ఏమైంది? అప‌ర్ణ స‌మ‌స్య‌ల‌కు సైకాల‌జిస్ట్ రుద్ర‌న్ ప‌రిష్కారం చూపించాడా? అప‌ర్ణ ద‌గ్గ‌ర ఉన్న‌క్రిస్ట‌ల్‌లో బంధించ‌బ‌డిన ఆత్మ‌గా బంధించ‌బ‌డిన మీరా ఎవ‌రు? మీరా ఎలా చ‌నిపోయింది? మీరాకు జ‌రిగిన అన్యాయంపై అప‌ర్ణ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది? అన్న‌దే గార్డియ‌న్ మూవీ క‌థ‌.

ఎమోష‌న‌ల్ ఫ్లాష్‌బ్యాక్‌...

విల‌న్స్‌పై ప‌గ‌ప‌ట్టిన ఓ ద‌య్యం...అనుకోకుండా హీరోయిన్‌ను ఆవ‌హించ‌డం...ఆ ద‌య్యం చెప్పిన ఎమోష‌న‌ల్ ఫ్లాష్‌బ్యాక్‌కు హీరోనో...లేదంటే హీరోయిన్ క‌రిగిపోవ‌డం...విల‌న్స్‌ను ఒక్కొక్క‌రిగా వెంటాడి చంపేయ‌డం...దాదాపు అన్ని హార‌ర్ సినిమాల్లో ఇదే క‌థ క‌నిపిస్తుంది. ఈ రొటీన్ టెంప్లెట్ స్టోరీతో వ‌చ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంకా ఈ 1990ల కాలం నాటి హార‌ర్ క‌థ‌ల‌తో సినిమాలు చేస్తే రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చెప్ప‌డానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా గార్డియ‌న్ మూవీ.

క్లైమాక్స్ ఏమిట‌న్న‌ది...

గార్డియ‌న్ సినిమా ఫ‌స్ట్ సీన్ నుంచి శుభం కార్డు వ‌ర‌కు ఎక్క‌డ ఓ కొత్త సినిమా చూస్తున్నామ‌నే ఫీలింగ్ క‌ల‌గ‌దు. సినిమా మొద‌లైన ఇర‌వై నిమిషాల‌కే క్లైమాక్స్ ఎమిట‌న్న‌ది ఈజీగా గెస్ చేసేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. హార‌ర్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్‌ను ఎంత ఎమోష‌న‌ల్‌గా రాసుకుంటే డ్రామా అంత‌గా ప‌డుతుంది. మీరా స్టోరీ పూర్తిగా తేలిపోయింది.

పాత‌వాస‌న‌ల‌తో...

అన్‌ల‌క్కీగా ముద్ర‌ప‌డిన ఓ యువ‌తి ఒక్క‌సారిగా ల‌క్కీగా మారిపోవ‌డం, ఆమె కోరుకున్న‌వ‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోవ‌డం అనే పాయింట్‌ను ఇంట్రెస్టింగ్‌గానే రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. ఎప్పుడైతే ద‌య్యం రివేంజ్ స్టోరీ మొద‌ల‌వుతుందో అక్క‌డి నుంచే సినిమా డ్రాప్ అయ్యింది. క‌థ‌లోనే కాదు క‌థ‌నంలో పాత‌వాస‌న‌లు చాలా క‌నిపిస్తాయి. ఒక్క‌టంటే ఒక్క సీన్ కూడా ట్రెండీగా రాసుకోలేక‌పోయాడు డైరెక్ట‌ర్‌.

ల‌వ్ స్టోరీ...

హ‌న్సిక ల‌వ్‌స్టోరీ కేవ‌లం సినిమా నిడివి పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డింది. గార్డియ‌న్ రిజ‌ల్ట్‌ను హ‌న్సిక‌తో పాటు మిగిలిన యాక్ట‌ర్లు కూడా ముందుగానే ఊహించిన‌ట్లున్నారు. ఎలాగోలా సినిమాను పూర్తిచేయాలి అన్న భావ‌నే వారి న‌ట‌న‌లో క‌నిపించింది. హార‌ర్ సినిమాల్లో క‌నిపించే ట్విస్ట్‌లు, స‌ర్‌ప్రైజ్ ఏవీ ఈ సినిమాలో క‌నించ‌వు.

మేక‌ప్ కృత‌కంగా...

హ‌న్సిక యాక్టింగ్‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. ద‌య్యం సీన్స్‌లో హ‌న్సిక మేక‌ప్ చాలా కృత‌కంగా ఉంది. విల‌న్స్‌గా సురేష్ చంద్ర మీన‌న్‌, శ్రీమాన్. విజ‌య్ చంద‌ర్‌ క్యారెక్ట‌ర్స్‌ను బ‌లంగా రాసుకోలేదు. ప్ర‌దీప్ రాయ‌న్ హీరో అన‌డం కంటే గెస్ట్ అని చెప్ప‌డం బెట‌ర్‌. మిగిలిన వారి యాక్టింగ్ కూడా పెద్ద‌గా గుర్తుంచుకునేలా లేదు. మోట్ట రాజేంద్ర‌న్ కామెడీ, హ‌న్సిక‌ను ఫాలో అవుతూ చిక్కుల్లో ప‌డే స‌న్నివేశాలు న‌వ్వించ‌లేక‌పోగా చిరాకును తెప్పిస్తాయి.

ఔట్‌డేటెడ్‌

గార్డియ‌న్ ఔట్‌డేటెడ్ హార‌ర్ మూవీ. ట్విస్ట్‌ల‌తో భ‌య‌పెట్ట‌దు. కామెడీతో న‌వ్వించ‌దు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం