Aha OTT: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆహా యాప్ కూడా ఔట్.. కారణమిదే!
Aha OTT - Google Play Store: గూగుల్ ప్లే స్టోర్‌లో ఆహా ఓటీటీ యాప్ మాయమైంది. ఈ యాప్‍ను తొలగించింది గూగుల్. దీంతో పాటు మరికొన్ని యాప్‍లను కూడా తీసేసింది. ఆ వివరాలివే..
Aha OTT: కొన్ని భారతీయ కంపెనీల యాప్‍లకు గూగుల్ షాకిచ్చింది. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‍లను తొలగించింది. ముందుగా ప్లే స్టోర్ నుంచి 10 కంపెనీలకు చెందిన యాప్‍లను తీసేసింది. అయితే, తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఆహా’ను కూడా ప్లే స్టోర్ నుంచి గూగుల్ తీసేసింది.
కారణం ఇదే..
తమ బిల్లింగ్ నిబంధనలను పాటించని కారణంగా కొన్ని యాప్‍లను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. సర్వీస్‍లకు పేమెంట్లు చెల్లించనందుకు కూడా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆహా ఓటీటీ ఆండ్రాయిడ్ యాప్‍ను కూడా ప్లే స్టోర్ నుంచి తీసేసింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం తమ యాప్ అందుబాటులో లేదని ఆహా ప్రకటించింది. అయితే, ఇప్పటికే యాప్ వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కొత్త యాప్ డౌన్‍లోడ్ చేసుకోవాలనుకునే వారిపై ప్రభావం ఉంటుందని తెలిపింది. అయితే, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం తీసుకొచ్చేందుకు పని చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ఈ యాప్స్ తొలగింపు
ఈ కారణాలతో గూగుల్ ఇప్పటి వరకు 11 యాప్‍లను తీసేసింది. భారత్ మాట్రిమోనీ, కూకూ ఎఫ్ఎం, నౌకరి (ఇన్ఫోఎడ్జ్), షాదీ.కామ్, 99ఏకర్స్, ఆల్ట్ బాలాజీ, ట్రూలీ మాడ్లీ, క్వాక్ క్వాక్, స్టేజ్, స్టేజ్ ఓటీటీ యాప్‍లను గూగుల్ తీసేసింది. నేడు ఆహా యాప్‍ను కూడా ప్లే స్టోర్ నుంచి తీసేసింది.
వివాదం ఇదే..
ఇన్‍యాప్ పేమెంట్‍లలో కంపెనీలకు గూగుల్ ప్లే స్టోర్ ఫీజును విధిస్తోంది. అయితే, ఆ ఫీజు చెల్లించలేదని కొన్ని యాప్‍లను గూగుల్ తొలగించింది. అలాగే, బిల్లింగ్ సిస్టమ్ పాటించడం లేదని కొన్ని యాప్‍లపై ఈ చర్యలు తీసుకుంది. గూగుల్ ఫీజుల బాదుడుపై కొన్ని సంస్థలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాయి. అయితే, ఆ సంస్థలకు తాత్కాలిక ఉపశమనం లభించలేదు.
తాము మూడేళ్ల నుంచి ఈ విషయంపై సంస్థలకు తెలియజేస్తున్నామని, అయినా పాటించలేదని గూగుల్ పేర్కొంది. తమ ఎకో సిస్టమ్‍లో ఉన్న అన్నీ తమ పాలసీలను పాటించాలని తెలిపింది.
గూగుల్‍పై ఆగ్రహం
గుత్తాధిపత్యం చెలాయిస్తూ భారతీయ కంపెనీలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని గూగుల్‍పై కొందరు సంస్థల ప్రతినిధులు, నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్‍కు తాము అన్ని చెల్లింపులు చేశామని, అన్ని పాలసీలు కూడా ఫాలో అవుతున్నామని ఇన్ఫోఎడ్జ్ ఫౌండర్ సంజీవ్ బిక్‍చందానీ తెలిపారు.
ఇండియాకు కూడా సొంత ప్లేస్టోర్ ఉండాలని సంజీవ్ అభిప్రాయపడ్డారు. యూపీఐ, ఓఎన్‍డీసీలా సొంత ప్లే స్టోర్ అవసరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‍కు ఆయన తన ట్వీట్‍ను ట్యాగ్ చేశారు. గూగుల్ చేసిన ఈ చర్య భారత్‍లో ఇంటర్నెట్‍కు డార్క్ డే అని భారత్ మాట్రిమోనీ ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్ పేర్కొన్నారు. కూకూ ఎఫ్ఎం సీఈవో లాల్ చంద్ కూడా గూగుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ప్లే స్టోర్‌లో ఆ యాప్‍లు లేకపోయినా.. ఇప్పటికే తమ డివైజ్‍ల్లో ఇన్‍స్టాల్ చేసుకున్న వారు యాప్‍లను వాడడం కొనసాగించుకోవచ్చు. యాపిల్ స్టోర్, వెబ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్తగా యాప్ డౌన్‍లోడ్ చేసుకోవాలనుకున్న వారికి ప్లే స్టోర్‌లో ప్రస్తుతం ఆహా సహా ఆ 11 యాప్‍లు అందుబాటులో లేవు. అయితే, ఈ వివాదం పరిష్కారమై ఆ యాప్‍లు ప్లే స్టోర్‌లో మళ్లీ అందుబాటులోకి ఎప్పుడు వస్తాయేమో చూడాలి.