Golam Review: గోలం రివ్యూ - షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Golam Review: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన మలయాళం మూవీ గోలం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఇటీవల రిలీజైంది. ఈ సినిమాలో రంజీత్ సజీవ్, సన్నీవేన్ కీలక పాత్రల్లో నటించారు.
Golam Review: రంజిత్ సజీవ్, సన్నీవేన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ గోలం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సమ్జద్ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఆఫీస్‌లోనే హత్య...
వీ టెక్ కంపెనీ అధినేత ఐసక్ జాన్ (దిలీష్ పోతన్) అనుమానాస్పద రీతిలో ఆఫీస్‌లోని బాత్‌రూమ్‌లో చనిపోతాడు. ఆ టైమ్‌లో ఆఫీస్‌లో పదమూడు మంది ఉద్యోగులు ఉంటారు. ఐసక్ జాన్ మినిస్టర్ బంధువు కావడంతో అతడి మరణ వార్త సెన్సేషనల్ అవుతుంది.
ఈ కేసును ఇన్వేస్టిగేట్ చేసే బాధ్యతను ఏఎస్‌పీ సందీప్ (రంజిత్ సజీవ్)తీసుకుంటాడు. ఐసక్ జాన్ హత్యకు గురయినట్లు ఎలాంటి ఆధారాలు లభించవు. సందీప్ మాత్రం ఇది హత్యేనని నమ్ముతాడు. ఐసక్ జాన్ ఆఫీస్‌లో పనిచేస్తోన్న పదమూడు మందిపై అనుమానంతో వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు.
వారందరితో సైకలాజిస్ట్ కురియాకోస్‌తో (సిద్ధిఖీ) సంబంధం ఉందని సందీప్ ఇన్వేస్టిగేషన్‌లో తెలుతుంది. జాన్ ఆఫీస్‌లో పనిచేస్తోన్న వారి వివరాలను కురియాకోస్ ద్వారా తెలుసుకోవాలని అనుకున్న సందీప్ అతడికి కలుస్తాడు. కురియాకోస్ ద్వారా ఆ పదమూడు మంది గురించి సందీప్‌కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అవేమిటి?
ఐసక్ జాన్‌ను ఎవరు చంపారు? మర్డర్ అని తెలిసిన కూడా నార్మల్ డెత్ అని సందీప్ ఎందుకు కేస్ క్లోజ్ చేశాడు? తన ఆఫీస్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులపై రెడ్ వైరస్ పేరుతో ఐసక్ జాన్ చేసిన క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ కథేమిటి? దానివల్ల ఉద్యోగులంతా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తమ ప్రాణాలతో చెలగాటమాడిన ఐసక్ జాన్‌పై ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అన్నదే గోలం మూవీ కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
సాధారణంగా మర్డర్ మిస్టరీ మూవీస్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా విలన్ చేసిన హత్యలను పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన తెలివితేటలతో కనిపెట్టడం కామన్‌గా కనిపిస్తుంది. ఈ పాయింట్‌ను కొత్తగా, ఎంగేజింగ్‌గా రాసుకున్నప్పుడే ఈ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. గోళం అలాంటి మూవీనే.
క్లినికల్స్ హ్యూమన్ ట్రయల్స్...
మానవాళికి పునర్జన్మను ప్రసాదించే మెడిసిన్స్ తయారీలో ఫార్మా కంపెనీలు సీక్రెట్‌గా క్లినికల్స్ హ్యమన్ ట్రయల్స్‌ను ఎలా చేస్తుంటాయి? మనుషులపై చేసే ఈ క్లినికల్స్ ట్రయల్స్ వల్ల వారి జీవితాలు ఎలా ప్రమాదంలో పడతాయనే అంశాలకు మర్డర్ మిస్టరీని జోడించి గోళం మూవీని తెరకెక్కించాడు దర్శకుడు సమ్జద్.
స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని కలిగించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. క్లినికల్ ట్రయల్ పాయింట్, క్రైమ్ ఇన్వేస్టిగేషన్ రెండింటిని మిక్స్ చేసి చెప్పిన విధానం కన్వీన్సింగ్‌గా అనిపిస్తుంది.
చిక్కుముడులకు ఆన్సర్...
జాన్ మర్డర్, ఉద్యోగులపై సందీప్ అనుమానంతో ఇన్వేస్టిగేషన్ చేసే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. ఎప్పుడైతే ఈ మర్డర్‌కు సైకాలజిస్ట్ కురియాకోస్‌కు సంబంధం ఉందని సందీప్ కనిపెడతాడో అక్కడి నుంచే కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ చివరకు జాన్‌ను ఎవరు హత్య చేశాడన్నది చూపించే సీన్ ఆకట్టుకుంటుంది.
మంచివాడిగా జాన్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ అతడిలోని విలనిజాన్ని బయటపెట్టే ట్విస్ట్ బాగుంది. జాన్‌ను ఎలాంటి ఆధారాలు లేకుండా ప్లానింగ్ ప్రకారం ఎలా హత్య చేశారన్నది సెకండాఫ్‌లో చూపించారు. ఆ ఎపిసోడ్‌ను రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా రాసుకున్నాడు దర్శకుడు.
చివరలో మరో కొత్త విలన్‌ను స్క్రీన్‌పైకి తీసుకొచ్చి సీక్వెల్‌ను అనౌన్స్‌చేశాడు. సినిమా కథ మొత్తం చాలా వరకు ఒకే ఆఫీస్‌లో సాగుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు, కామెడీ ట్రాక్‌లు లాంటి కమర్షియల్ హంగులు సినిమాలో కనిపించవు.
లాజిక్స్ మిస్...
కాన్సెప్ట్ బాగున్నా కొన్ని చోట్ల లాజిక్స్ మిస్సయ్యాయి. జాన్ ఎలా హత్యకు గురయ్యాడన్నది హీరో కనిపెట్టినట్లుగా కాకుండా ఇమాజినేషన్‌లా చూపించేశారు. ఇన్వేస్టిగేషన్ సీన్స్ లో కొన్ని అనవసరమైన క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై తీసుకొచ్చి అనుమానం రేకెత్తించేలా చేయాలని చూశారు డైరెక్టర్. ఆ సీన్స్ అంతగా వర్కవుట్ కాలేదు.
పోలీస్ ఆఫీసర్‌ను తలపించేలా...
ఏసీసీ సందీప్‌గా రంజీత్ సజీవ్ యాక్టింగ్ బాగుంది. లుక్, డైలాగ్ డెలివరీ నిజమైన పోలీస్ ఆఫీసర్‌ను తలపించేలా డిజైన్ చేశారు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్ దిలీష్ పోతాన్, సైకలాజిస్ట్‌గాసిద్ధిఖీ తమ క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. ఆఫీస్ ఎంప్లాయ్స్‌గా కనిపించే వారి నటన ఆకట్టుకుంటుంది.
థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్‌ను...
గోళం కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే పరంగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియెన్స్‌ను తప్పకుండా గోళం మెప్పిస్తుంది.