Telugu News  /  Entertainment  /  Ginna Movie Review Manchu Vishnu Sunny Leone Payal Rajput
మంచు విష్ణు, స‌న్నీ లియోన్‌
మంచు విష్ణు, స‌న్నీ లియోన్‌

Ginna Movie Review: జిన్నా మూవీ రివ్యూ - మంచు విష్ణు సినిమా ఎలా ఉందంటే

21 October 2022, 12:38 ISTNelki Naresh Kumar
21 October 2022, 12:38 IST

Ginna Movie Review: జిన్నా మూవీతో దాదాపు ఏడాదిన్న‌ర‌ విరామం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌, హీరో మంచు విష్ణు. ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే..

Ginna Movie Review:

మూవీ - జిన్నా

ట్రెండింగ్ వార్తలు

న‌టీన‌టులు- మంచు విష్ణు, స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌ద్ధాం, న‌రేష్‌, ర‌ఘుబాబు

సంగీతం- అనూప్ రూబెన్స్‌

క‌థ‌ - కోన వెంక‌ట్‌

సినిమాటోగ్ర‌ఫీ- ఛోటా కె నాయుడు

నిర్మాత‌, స్క్రీన్‌ప్లే - మోహ‌న్‌బాబు

మంచు విష్ణు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ అందుకొని చాలా కాల‌మైంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని బ‌లంగా నిర్ణ‌యించుకొన్న విష్ణు త‌న‌కు అచ్చొచ్చిన కామెడీ జోన‌ర్‌ను న‌మ్ముకొని జిన్నా మూవీ చేశాడు. కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించిన ఈసినిమాకు ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టించిన తొలి సినిమా ఇది.

స‌న్నీలియోన్‌తో పాటు పాయ‌ల్ రాజ్‌పుత్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. జిన్నా లో హీరోగా న‌టిస్తూనే స్వ‌యంగా ఈ సినిమాను మంచు విష్ణు నిర్మించారు. టైటిల్‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో మంచు విష్ణు హీరోగా ప్రొడ్యూస‌ర్‌గా విజ‌యాన్ని అందుకున్నాడా? దీపావ‌ళికి భారీ పోటీ మ‌ధ్య విడుద‌లైన జిన్నా సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

Ginna movie story: న‌లుగురు ఫ్రెండ్స్ క‌థ‌...

జిన్నా ఓ టెంట్‌హౌజ్ ఓన‌ర్‌(విష్ణు). ఊరినిండా అప్పుల‌తో బ‌లాదూర్‌గా తిరుగుతుంటాడు. జిన్నా టెంట్‌హౌజ్‌ను బుక్ చేస్తే ఆ పెళ్లి ఆగిపోతుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉండ‌టంతో అత‌డి బిజినెస్ డ‌ల్‌గా సాగుతుంది. గోవ‌ర్ధ‌న్ అనే వ్య‌క్తికి పెద్ద మొత్తంలో జిన్నా బాకీ ప‌డ‌తాడు. ఆ అప్పు తీర్చ‌డంతో పాటు ఊరి ప్రెసిడెంట్‌గా ఎన్నికై ప్రియురాలు స్వాతిని (పాయ‌ల్ రాజ్‌పుత్‌) పెళ్లి చేసుకోవాల‌న్న‌ది జిన్నా ఆశ‌యం. ఆ అప్పు తీర్చే మార్గం కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో జిన్నా చిన్న‌నాటి స్నేహితురాలు రేణుక (స‌న్నీ లియోన్‌) అమెరికా నుంచి ఆ ఊరికి వ‌స్తుంది.

జిన్నాను పెళ్లి చేసుకోవ‌డానికే వ‌చ్చాన‌ని చెబుతుంది. స్వాతిని ప్రేమిస్తున్న విష‌యాన్ని దాచిపెట్టి రేణుక ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు కొట్టేయాల‌ని జిన్నా స్కెచ్ వేస్తాడు. ఈ క్ర‌మంలో ఆమె త‌న ఫ్రెండ్ రేణుక కాద‌ని, రూబీ డిసౌజా అనే మ‌రో యువ‌తి అని జిన్నాకు తెలుస్తుంది? రూబీ డిసౌజా ఎవ‌రు? రేణుక పేరుతో ఆమె ఆ ఊరిలో ఎందుకు అడుగుపెట్టింది? జిన్నాను పెళ్లి చేసుకోవాల‌ని ఎందుకు అనుకున్న‌ది? రూబీ కార‌ణంగా స్వాతి లైఫ్ ఎలా ప్ర‌మాదంలో ప‌డింది? స్వాతిని జిన్నా ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే జిన్నా క‌థ‌.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో...

ఢీ, దేనికైనా రెడీ లాంటి కామెడీ సినిమాలు మంచు విష్ణుకు విజ‌యాల్ని తెచ్చిపెట్టాయి. మ‌ధ్య‌లో మాస్ వైపు ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకున్న అత‌డు మ‌రోసారి స‌క్సెస్ కోసం కామెడీని న‌మ్ముకొని జిన్నా సినిమా చేశాడు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఓ అమ్మాయి రూపంలో మ‌రో యువ‌తి ఆత్మ‌గా రావ‌డం, అంద‌రిని భ‌య‌పెట్ట‌డం అనే పాయింట్‌తో తెలుగులో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఈ రొటీన్ పాయింట్‌కు చాలా కొద్దిగా మార్పులు చేస్తూ జిన్నా సినిమాను రూపొందించిన ర‌చ‌యిత కోన వెంక‌ట్‌, ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించారు. హీరోయిన్ల గ్లామ‌ర్‌, డ‌బుల్ మీనింగ్ జోక్స్ పాస్ అయిపోవ‌చ్చున‌ని అనుకున్నారు.

ఓల్డ్ ట్రీట్‌మెంట్‌...

క‌థ పాత‌దే అయినా దాని ట్రీట్‌మెంట్ కొత్త‌గా ఉంటే ప్రేక్ష‌కులు ఆద‌రించిన సంద‌ర్భాలు టాలీవుడ్‌లో చాలా ఉన్నాయి. కానీ ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య ఆ దిశ‌గా ఏ మాత్రం ప్ర‌య‌త్నించ‌లేదు. రాత‌, తీత‌లో పూర్తిగా ప‌దేళ్ల క్రితం నాటి ఫీలింగ్ క‌లిగిస్తుంది. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ మొద‌లుకొని కామెడీ సీన్స్ రాసుకోవ‌డం వ‌ర‌కు అన్నీ అవుట్‌డేటెడ్ ఫార్ములాతో సాగుతాయి

ఫ్లాష్‌బ్యాక్ బాగున్నా...

జిన్నా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో క‌థ కాస్త ఇంట్రెస్ట్‌గానే మొద‌ల‌వుతుంది. చిన్న‌త‌నంలోనే జిన్నాకు రేణుక దూరం అవ్వ‌డం చూపించి కొత్త క‌థ చెబుతున్న ఫీలింగ్‌ను ఆడియెన్స్‌లో క్రియేట్ చేశారు. కానీ ఆ క్రియేటివిటీ మొత్తం ఐదు నిమిషాల‌కే ప‌రిమిత‌మైంది. జిన్నా ఎంట్రీ ఇచ్చే సీన్స్‌తో రొటీన్ దారిలోకి అడుగుపెట్టాడు. అప్ప‌టి నుంచి విరామం వ‌ర‌కు సినిమా టైమ్‌పాస్ వ్య‌వ‌హారంలాగే సాగుతుంది.

ఓ కామెడీ, యాక్ష‌న్‌, రొమాన్స్ ఇలా సీన్స్‌ను వ‌రుస‌గా పేర్చుకుంటూ సినిమాను చుట్టేశారు. ఇంట్రావెల్ ముందు రేణుక రూపంలో రూబీ డిసౌజా వ‌చ్చిందంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఎగ్జైట్‌మెంట్‌ను క‌లిగించారు. కానీ హీరోయిన్ ద‌య్యంలా ప్ర‌వ‌ర్తించ‌డం, ప‌క్క‌న క‌మెడియ‌న్‌ల‌ను పెట్టుకొని వారితో కామెడీ చేయ‌డం లాంటి సీన్స్‌తో కాలం చెల్లిన ఫార్మెట్‌లో సెకండాఫ్ మొత్తం ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికి తెగ ట్రై చేశాడు. చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్ట్ ఒక్క‌టే కొద్దిగా బాగుంది.

సోష‌ల్ మీడియా ట్రోల్స్‌..

సోష‌ల్ మీడియాలో విష్ణుపై వ‌చ్చే ట్రోల్స్ గురించి జిన్నా సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి. న‌న్ను ట్రోల్ చేయండి ఎంజాయ్ చేస్తా కానీ నా ఫ్యామిలీ జోలిక‌స్తే ఊరుకోను అనే డైలాగ్‌తో పాటు త‌న‌ను తాను పాన్ ఇండియ‌న్ యాక్ట‌ర్ అని పిలుచుకోవ‌డం ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాయి.. చాలా చోట్ల త‌న‌పైనే సెటైర్స్ వేసుకున్నాడు. ఎలెక్ష‌న్ల వ్య‌వ‌హారం మొత్తం సోష‌ల్ మీడియాలో వ‌చ్చే మీమ్స్‌తో నింపేశారు. అందులో కొన్ని పేలాయి.

విష్ణు ఓకే కానీ...

జిన్నా పాత్ర‌లో విష్ణు కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. డ్యాన్సుల‌తో పాటు యాక్టింగ్ విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. రొటీన్ క‌థ కార‌ణంగా అత‌డి శ్ర‌మ‌ వృథా అయ్యింది. స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ గ్లామ‌ర్ ప‌రంగా సినిమాకు అట్రాక్ష‌న్‌గా నిలిచారు. వారి యాక్టింగ్ గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. చివ‌ర‌లో స‌న్నీలియోన్ ఫేస్‌లో ప‌లికే ఎక్స్‌ప్రెష‌న్స్ ఎంత‌కు అర్థం కావు. స‌ద్దాం, ర‌ఘుబాబు కామెడీ అక్క‌డ‌క్క‌డా వ‌ర్క‌వుట్ అయ్యింది. సెకండాఫ్‌లో వెన్నెల‌కిషోర్ టైమ్‌పాస్ చేశాడు.చ‌మ్మ‌క్‌చంద్ర సీన్స్ బూతుల‌తో నింపేశారు. న‌రేష్ విల‌నిజం ఒకే అనిపిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగున్నా పాట‌ల్లో వ‌చ్చే ప‌దాలు ఇబ్బందిపెట్టాయి. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ, క్లోజ‌ప్ షాట్స్ 1990 సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. చివ‌ర‌లో జిన్నా సినిమాకు సీక్వెల్ ప్ర‌క‌టించారు.సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించింది కోన వెంక‌ట్ అని చెప్పారు. కానీ టైటిల్ కార్డ్స్‌లో మాత్రం మోహ‌న్‌బాబు (Mohanbabu) పేరు క‌నిపించింది.

Ginna movie: అవుట్‌డేటెడ్ స్టోరీ...

జిన్నా అవుట్‌డేటెడ్ పాయింట్‌తో తెర‌కెక్కిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌కు అల‌వాటుప‌డిన ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే కంటెంట్ ఇందులో పెద్ద‌గా లేదు.

రేటింగ్ : 2/5