తెలుగు లెజండరీ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. పౌరాణిక పాత్రలతో ఆయన ఎంతగానో మెప్పించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో యముడి పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆయన తర్వాతే ఎవరైన అనేంతలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి కైకాల సత్యనారాయణ పోషించిన మరో మంచి పౌరాణిక పాత్ర ఘటోత్కచుడు.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఘటోత్కచుడు సినిమాలో కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ పోషించి మెప్పించారు. కథ, కథనాలు, నటీనటుల యాక్టింగ్ పరంగానే కాకుండా ఇందులోని పాటలు కూడా ఎంతగానో హిట్ సాధించాయి. ఘటోత్కచుడుగా కైకాల సత్యనారాయణ నటించిన ఈ సినిమాలో అందాల అపరంజి బొమ్మ ఒక సూపర్ హిట్ సాంగ్.
తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తప్పించుకున్న చిట్టీ అనే పాప అడవిలో తప్పిపోతుంది. పూర్వ జన్మలో తను ఇచ్చిన మాట ప్రకారం పాపను ఆదుకోడానికి వస్తాడు ఘటోత్కచుడు. అప్పుడు అమ్మ కోసం ఏడ్చే చిట్టికి అమ్మ ప్రేమ చెప్పే క్రమంలో అందాల అపరంజి బొమ్మ సాంగ్ వస్తుంది.
"స్వర్గానా ఉన్న మాత.. నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన (కూతురు). నీ మాటగా నేను చెప్పెదు తల్లి. ఆహా.. దివ్యోపదేశం.. దివ్యోపదేశం మాతా" అని ఘటోత్కచుడు (కైకాల సత్యనారాయణ) అంటే చెప్పు "అంకుల్.. అమ్మ ఏం చెప్పిందో చెప్పు" అని చిట్టి (బేబీ నిఖిత) బతిమిలాడుకుటుంది. దాంతో "చెప్తాను తల్లి చెప్తా" అంటూ ప్రారంభమయ్యే అందాల అపరంజి బొమ్మ సాంగ్ లిరిక్స్ ఇక్కడ విందాం.
అందాల అపరంజి బొమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
కడుపారా నినుగన్న అమ్మా..
చూడలేదమ్మా నీ కంట చెమ్మా..!
కనుమరుగునున్నా నిను మరువదమ్మా..
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా,
చెబుతాను వినవమ్మా..!
అందాల అపరంజి బొమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
ఆకలందంటే ఆ చిన్ని బొజ్జా..
అడగకుండానే తెలుసుకోమందీ..!
ఆటాడుకోగా తోడెవ్వరంటే,
అంబారీగట్టీ ఆడించమందీ..!
నీకేం కావాలన్నా.. నాకు చెబుతూ ఉంటానంది.. ఆ..!
తానె లోకానున్నా.. నిన్ను చూస్తూ ఉంటానంది..!
కాపాడుకుంటా కనుపాపలాగా..
నిను చూసుకుంటా నీ అమ్మలాగా..
నమ్మమ్మ నా మాటా..!
అందాల అపరంజి బొమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
మావయ్యనంటూ నిను చేరమందీ..
మంచి మాటలతో మరిపించమందీ..!
కథలెన్నో చెప్పి నవ్వించమందీ..
ఒడిలోన చేర్చి ఓదార్చమందీ..!
జో జో పాపా అంటూ..
తానూ రోజూ పాడే లాలి..
ఇట్టా పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి..!
మా పాపానిపుడూ కాపాడమంటూ..
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే..
పని మీద వెళ్లింది..!
అందాల అపరంజి బొమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
కడుపారా నినుగన్న అమ్మా..
చూడలేదమ్మా నీ కంట చెమ్మా..!
కనుమరుగునున్నా నిను మరువదమ్మా..
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా..
చెబుతాను వినవమ్మా..!
అందాల అపరంజి బొమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
ఇలా మనసుకు హత్తుకునే పదాలతో సాగే ఈ అందాల అపరంజి బొమ్మ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. ఘటోత్కచుడు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డినే మూవీకి సంగీతం అందించడం విశేషం.
సంబంధిత కథనం