Geethanjali Malli Vachindi: హనుమంతుడిలా ఆత్మల కోసం సినిమా థియేటర్‌లో ఓ సీటు.. నిర్మాత రిప్లై వైరల్
Kona Venkat Reply To Seat For Ghosts: హీరోయిన్ అంజలి సినీ కెరీర్‌లో 50వ సినిమాగా వస్తోన్న మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ప్రదర్శించే థియేటర్‌లో ఆత్మల కోసం ఓ సీటు ఉంచుతారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి నిర్మాత కోన వెంకట్ ఏం చెప్పారంటే..
Geethanjali Malli Vachindi Updates: అచ్చమైన తెలుగు హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ అంజలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో ఓ కథానాయికగా నటిస్తోన్న అంజలి మెయిన్ లీడ్ హీరోయిన్‌గా చేస్తున్న మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా వస్తోంది. 2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నగీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ అని తెలిసిందే.
శ్మశానవాటికలో టీజర్ లాంచ్
కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న విడుదల తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మశాన వాటికలో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, దానికి అతిథులు స్పందించకపోవడం, చాలా మంది భయం వ్యక్తం చేయడంతో దాన్ని మానుకున్నారు.
మారిన వేదిక
అనంతరం దస్‌పల్లా వేదికగా లాంచింగ్ ప్రోగ్రామ్ మార్చారు. ఈ సమయంలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ప్రదర్శించే థియేటర్‌లో ఆత్మల కోసం ఓ సీటు కేటాయిస్తారా అని నిర్మాత కోన వెంకట్‌కు ఓ నెటిజన్ చమత్కారంగా ప్రశ్నించారు. దానికి నిర్మాత కోన వెంకట్ ఇచ్చిన రిప్లై కూడా ఆకట్టుకుంటుంది.
వచ్చి కూర్చుంటూనే
"ఆదిపురుష్ సినిమాకు ఓ సీటు హనుమంతుడికి వదిలేసినట్లు.. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు ఓ సీటును ఆత్మల కోసం వదిలేస్తే ఎలా ఉంటుందో?" అని ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేశారు. దానికి "ఐడియా బాగుంది మూర్తి గారు.. కానీ నిజంగా వచ్చి కూర్చుంటేనే ప్రాబ్లం" అని నవ్వుతున్న ఎమోజీతో నిర్మాత, రైటర్ కోన వెంకట్ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు ఇలా చేయడం కూడా తప్పు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
50 అనేది స్పెషల్
కాగా ఇటీవల జరిగిన గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్‌లో సినిమాపై అంజలి తన అభిప్రాయం పంచుకుంది. "ఇది నాకు చాలా ప్రత్యేకం. గీతాంజలి నాకు ఫస్ట్ సెంట్రిక్ మూవీ. ఇది నాకు 50వ సినిమా. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్‌లో మంచి అనుభూతిని పొందుతారు. 50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది" అని అంజలి తెలిపింది.
అప్పుడే చెప్పారు
"దర్శకుడు శివకు మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనివాసరెడ్డి, రాజేష్, అలీ, షకలక శంకర్, అవినాష్, రాహుల్ ఇలా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అంతా చాలా కష్టపడి చేశాం. కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లే. నిశ్శబ్దం టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశాం" అని అంజలి చెప్పుకొచ్చింది.
శ్రీ విష్ణు గ్రేట్
"సిద్దు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్, పాటలు బాగా ఇచ్చారు. నందు, భాను రైటింగ్ బాగుంది. ఈ చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి. మా ఈవెంట్‌కు వచ్చిన దర్శకులు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు తన సినిమా (ఓం భీమ్ బుష్) రిలీజ్ అవుతున్నా కూడా మా కోసం రావడం చాలా గ్రేట్. మా రెండు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి. మార్చి 22న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి" అని హీరోయిన్ అంజలి కోరింది.
టాపిక్