Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..
Geethanjali Malli Vachindi OTT Release Date: 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..
Geethanjali Malli Vachindi OTT: హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. 2014లో వచ్చి సూపర్ హిట్ అయిన గీతాంజలికి పదేళ్ల తర్వాత సీక్వెల్‍గా అడుగుపెట్టిన ఈ మూవీకి మంచి హైప్ ఏర్పడింది. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే!
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. మే 10వ తేదీన ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది.
దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే మే 10న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రావడం దాదాపు ఖరారైంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. భాను భోగవరపు, కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించిన ఈ సినిమాను శివ తెరకెక్కించారు. అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ, రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా అంజలికి 50వ మూవీ కావడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ మూవీ కోసం టీమ్ బాగా ప్రమోట్ చేసింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవటంతో మంచి బజ్ నెలకొంది. అయితే, ఈ చిత్రానికి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కామెడీ పండినా స్టోరీలో కొత్తదనం లోపించిందనే అభిప్రాయాలు వచ్చాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి నిరాశే ఎదురైంది.
'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ చేశారు.
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ స్టోరీ బ్యాక్‍డ్రాప్
సినిమా షూటింగ్ కోసం ఓ మహల్‍లోకి అడుగుపెట్టిన వారికి ఎదురయ్యే పరిస్థితుల చుట్టూ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ స్టోరీ తిరుగుతుంది. దర్శకుడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీను (శ్రీనివాస రెడ్డి) తన స్నేహితుడు అయాన్ (సత్య)తో కలిసి మూవీ తీసేందుకు నిర్ణయించుకుంటాడు. అయితే, అవాంతరాలు ఎదురవుతాయి. ఆ తరుణంలో విష్ణు (రాహుల్ మాధవ్) ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటానని కాల్ చేస్తాడు. తనకు సంగీత్ మహల్ ఉందని, ఈ మూవీ షూటింగ్ ఆ మహల్‍లోనే చేయాలని విష్ణు పట్టుబడతాడు. ఈ మూవీకి అంజలి (అంజలి)ని హీరోయిన్‍గా తీసుకుంటారు. సంగీత్ మహల్‍లోనే షూటింగ్ చేస్తారు. ఆ మహల్‍లో శ్రీను, అయాన్, అంజలికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది.. విష్ణు పెట్టిన షరతుకు కారణం ఏంటి? అనే అంశాలు గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో కీలక విషయాలు ఉంటాయి.