Joshua OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన గౌతమ్ మీనన్ తమిళ్ డిజాస్టర్ మూవీ - ఎందులో చూడాలంటే?
Joshua OTT Streaming:గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ జాషువా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ యాక్షన్ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Joshua OTT Streaming: ప్రస్తుతం డైరెక్టర్‌గా గౌతమ్ మీనన్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ కింగ్‌గా నిలిచాడు గౌతమ్ మీనన్. కాక్కా కాక్క (తెలుగులో ఘర్షణ), ఏమాయ చేశావే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలో కోలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో రిలీజైన అజిత్ ఎన్నై అరిందాల్ తర్వాత గౌతమ్ మీనన్ బ్యాడ్‌టైమ్ స్టార్టయ్యింది. ఆ తర్వాత అతడు చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సరైన విజయాల్ని అందుకోలేకపోయాయి.
జాషువా డిజాస్టర్...
విక్రమ్‌తో అతడు చేసిన ధృవనక్షత్రం షూటింగ్ పూర్తయి ఐదేళ్లు గడిచిన ఇప్పటికి రిలీజ్‌కు నోచుకోలేదు. తాజాగా అతడు దర్శకత్వం వహించిన తమిళ్ లో బడ్జెట్ మూవీ జాషువా కూడా డిజాస్టర్ అయ్యింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మార్చి 1న థియేటర్లలో రిలీజైంది. జాషువా సినిమాలో వరుణ్, రాహి హీరోహీరోయిన్లుగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నా కథ, నటనలో కొత్తదనం లేకపోవడంతో జాషువా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవక ముందే జాషువా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్...
గురువారం నుంచి జాషువా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.
జాషువా కథ ఇదే...
జాషువా ఓ కాంట్రాక్ట్ కిల్లర్. కుందవి అనే ఎన్ఆర్ఐ లాయర్‌కు బాడీగార్డ్‌గా పనిచేసే డీల్‌ను కుదర్చుకుంటాడు జాషువా. మెక్సికన్ డ్రగ్ గ్యాంగ్ కుందనిని టార్గెట్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారి నుంచి కుందవిని జాషువా ఎలా కాపాడాడు? జాషువాకు, కుందికి ఇదివరకే పరిచయం ఉందా? కుందివిని ప్రేమించిన జాషువా ఆమెకు ఎందుకు దూరమయ్యాడు అన్నదే ఈ మూవీ కథ. 2019లోనే గౌతమ్ మీనన్ జాషువా మూవీని అనౌన్స్ చేశాడు. కొవిడ్‌తో పాటు ఇతర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అన్ని అడ్డంకులను తొలగించుకొని మార్చి 1న ఈ మూవీ రిలీజైంది.
నటుడిగా బిజీ...
డైరెక్టర్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో యాక్టింగ్‌పై ఫోకస్ పెడుతోన్నాడు గౌతమ్ మీనన్. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కోలీవుడ్‌లో ఫేమస్‌గా మారిపోయాడు. గత ఏడాది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచి దళపతి విజయ్ లియో, వెట్రి మారన్ విడుదలై తో పాటు పలు సినిమాల్లో గౌతమ్ మీనన్ పోలీస్ పాత్రలు చేశాడు. తెలుగులో నటుడిగా గౌతమ్ మీనన్‌కు మంచి అవకాశాలు వస్తోన్నాయి. 2023లో సందీప్ కిషన్ మైఖేల్, శ్రీసింహ ఉస్తాద్ సినిమాల్లో గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించాడు.
బాలకృష్ణ… బాబీ సినిమాలో…
ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో గౌతమ్ మీనన్ నటిస్తున్నాడు. మలయాళంలో మమ్ముట్టితో బజూక సినిమా చేస్తున్నాడు గౌతమ్ మీనన్.