ఓ తమిళ యాక్షన్ కామెడీ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు గ్యాంగర్స్ (Gangers). ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు, సుందర్ సి లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీతో తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
గ్యాంగర్స్ తమిళ యాక్షన్ కామెడీ మూవీ. సుందర్ సి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా గురువారం (మే 15) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
డైరెక్టర్, నటుడు అయిన సుందర్ సి చాలా రోజుల తర్వాత మరోసారి కమెడియన్ వడివేలుతో కలిసి తీసిన సినిమా ఈ గ్యాంగర్స్. గతంలో లండన్, విన్నర్ లాంటి మూవీస్ తీసిన ఈ జోడీ.. ఇప్పుడు మరో యాక్షన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఈ ఇద్దరితోపాటు కాథరిన్ ట్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ కూడా నటించారు. వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.
ఈ గ్యాంగర్స్ మూవీ ఓ చిన్న ఊళ్లో జరిగే స్టోరీ. అక్కడి స్కూల్లోని ఓ విద్యార్థిని కనిపించకుండా పోతుంది. దీంతో ఆ స్కూల్ టీచర్ సుజిత పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అప్పుడే ఓ పోలీస్ అండర్ కవర్ గా ఆ స్కూల్లో పీటీ టీచర్ గా చేరతాడు. అప్పటికే అక్కడ టీచర్ సుజిత వెంట పడే మరో పీటీ టీచర్ సింగారం ఉంటాడు. ఆ తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఈ దోపిడీ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోతుంది.
ఈ సినిమాకు థియేటర్లలో కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా క్లైమ్యాక్స్ బాగుందని ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. ఐఎండీబీలో 6.7 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం