Gandhi Thatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ - సుకుమార్ కూతురు నటించిన మూవీ ఎలా ఉందంటే?
Gandhi Thatha Chettu: సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు మూవీతో యాక్టర్‌గా సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గాంధీ తాత చెట్టు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. గాంధీ తాత చెట్టు మూవీ ఎలా ఉందంటే?

గాంధీ సిద్దాంతాలతో...
రామచంద్రయ్య(ఆనంద చక్రపాణి) గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తుంటాడు. గాంధీజీపై ఉన్న అభిమానంతో తన మనవరాలికి గాంధీ (సుకృతి వేణి) అనే పేరు పెడతాడు. రామచంద్రయ్య తనకున్న పదెకరాల పొలంలో ఓ వేపచెట్టు నాటుతాడు. ఆ చెట్టుపై అభిమానాన్నిపెంచుకుంటాడు. తన కష్టాలను సుఖాలను చెట్టుతోనే పంచుకుంటాడు. షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో గాంధీ తల్లిదండ్రులతో (రఘురాం, లావణ్య) పాటు మిగిలిన గ్రామస్తుల ఉపాధి పోతుంది.
ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి ఊళ్లోని భూములను ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధి సురేష్ (రాగ్ మయూర్) కొనడానికి వస్తాడు. రామచంద్రయ్య భూమిపై కన్నేస్తాడు. కానీ ఆ కంపెనీ వారికి తన భూమిని అమ్మడానికి రామచంద్రయ్య ఒప్పుకోడు. ఈ క్రమంలో కన్న కొడుకుతో పాటు ఊరివాళ్లకు రామచంద్రయ్య శత్రువుగా మారిపోతాడు. ఆ తర్వాత ఏమైంది?
రామచంద్రయ్య ఎలా చనిపోయాడు? తాత ప్రాణంగా పెంచుకున్న చెట్టును ఎలా కాపాడింది? ఊళ్లోని భూములను కాపాడేందుకు అహింస మార్గంలో గాంధీ చేసిన పోరాటం తల్లిదండ్రులతో పాటు ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అన్నదే ఈ మూవీ కథ.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...
సామాజిక సమస్యల్ని కథా వస్తువులుగా తీసుకొని సినిమాలు చేసే ట్రెండ్ ఇదివరకు టాలీవుడ్ ఎక్కువగా కనిపించేది. మాస్, యాక్షన్, కామెడీలతో కూడిన కమర్షియల్ మూవీస్ కు ఆదరణ పెరిగిపోవడంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల ఒరవడి టాలీవుడ్ చాలా తగ్గుముఖం పట్టింది. ఆ లోటును కొంత వరకు భర్తీ చేస్తూ తెరకెక్కిన మూవీ గాంధీ తాత చెట్టు.
అహింస మార్గంలో...
అహింస ఆయుధంగా చేసుకొని బ్రిటీషర్లను దేశం నుంచి తరిమికొట్టాడు గాంధీ. ఆయన బాటలోనే కార్పొరేట్ శక్తుల బారి నుంచి తమ ఊరిని ఓ అమ్మాయి ఎలా కాపాడిందనే పాయింట్‌తో దర్శకురాలు పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించారు. చెట్లకు ప్రాణం ఉంటుందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని ఇచ్చారు.
తమ స్వార్థం కోసం పచ్చని పల్లెలను కార్పొరేట్ శక్తులు ఎలా నాశనం చేయాలని చూస్తున్నాయో గాంధీ తాత చెట్టులో ఆలోచనాత్మకంగా చూపించారు. తెలంగాణ నేటివిటీతో ఈ కథను చెప్పడంతో ఫ్రెష్‌ఫీల్ వచ్చింది.
నాచురల్‌గా...
రామచంద్రయ్య సిద్ధాంతాలు, మనవరాలితో ఆయనకున్న అనుబంధాన్ని చూపిస్తూ సినిమాను మొదలుపెట్టారు డైరెక్టర్. సినిమాటిక్‌గా కాకుండా నాచురల్‌గా రాసుకున్న ఆ సీన్స్‌తో ఆడియెన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశారు. భూములు కొనడానికి ఊళ్లోకి కంపెనీ ప్రతినిధి (రాగ్ మయూర్) రావడం, అతడిని రామచంద్రయ్య ఎదురించే సన్నివేశాల్లో డ్రామా బాగా పడింది.
ఇతరులు నాటిన చెట్లపై ఆధారపడి బతకడంలో అర్థం లేదంటూ రామచంద్రయ్య పడే బాధను డైలాగ్స్ రూపంలో ఎమోషనల్‌గా చూపించారు. చెట్టకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని చెప్పిన తీరు బాగుంది.
ఎమోషనల్ క్లైమాక్స్...
రామచంద్రయ్య పెంచుకున్న చెట్టును కాపాడటం కోసం గాంధీ ఏం చేసింది అన్నది సెకండాఫ్‌లో హృద్యంగా దర్శకురాలు ఆవిష్కరించారు. డబ్బులు సంపాదించడం కోసం గాంధీ చేసిన పనులు, చక్కెర సత్యగ్రహం ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. తనకు పెళ్లి చేయాలని అనుకున్న తండ్రి ఆలోచనను తప్పని గాంధీ చాటిచెప్పే సీన్ కొత్తగా అనిపిస్తుంది. . క్లైమాక్స్‌ను ఎమోషనల్‌గా ముగించారు. డ్రామా అనుకున్న స్థాయిలో పండకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది.
ఓపికగా చూస్తే...
కమర్షియల్ సినిమాల్లో కనిపించే యాక్షన్, రొమాన్స్, కామెడీ లాంటి అంశాలేవి ఈ సినిమాలో కనిపించదు. ఫాస్ట్ ఫేజ్ సినిమాలకు అలవాటు పడిన నేటితరం ఆడియెన్స్‌కు గాంధీ తాత చెట్టు ఎక్కడ కొంత కష్టమే. ఆర్ట్ సినిమా ఫీల్‌ను కలిగిస్తుంది. ఓపికగా చూస్తే మాత్రం మంచి ఫీల్ కలిగిస్తుంది.
తెలంగాణ యాసలో...
గాంధీ పాత్రకు సుకుమార్ కూతురు సుకృతి వేణి చాలా వరకు న్యాయం చేసింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. క్యారెక్టర్‌ను ఎంత ప్రేమించి చేసింది అన్నది ప్రతి ఫేమ్‌లో కనిపిస్తుంది. తాత పాత్రలో నటించిన ఆనంద చక్రపాణి, నాచరల్ యాక్టింగ్‌ను కనబరిచాడు.
చెట్టుకు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ చక్కగా కుదిరింది. రామ్‌మయూర్, రఘురాం, లావణ్యతో పాటు మిగిలిన వాళ్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డైరెక్టర్‌గా పద్మావతి మల్లాదికి ఇదే తొలి సినిమా. ఆమె ఎంచుకున్న కాన్పెప్ట్ బాగుంది. రీ మ్యూజిక్, బీజీఎమ్ కథకు తగ్గట్లుగా సాగాయి.
సుకుమార్ కూతురు...
గాంధీ తాత చెట్టు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. సుకుమార్ కూతురు సుకృత వేణి నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది.
రేటింగ్: 2.75/5