Gandeevadhari Arjuna Review: టాలీవుడ్‌లో ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ స్పై యాక్షన్ కథతో వరుణ్‌తేజ్ చేసిన తాజా చిత్రం గాండీవధారి అర్జున శుక్రవారం (ఆగస్ట్ 25న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. స్పై కథతో వరుణ్‌తేజ్ హిట్ కొట్టాడా? దర్శకుడిగా తనపై వస్తోన్న విమర్శలకు ప్రవీణ్ సత్తారు ఈ మూవీతో బదులిచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే....
గ్లోబల్ సమ్మిట్ కోసం లండన్‌కు వచ్చిన సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ బహదూర్ (నాజర్) మీద ఎటాక్స్ జరుగుతాయి. ఈ ఎటాక్స్ నుంచి సెంట్రల్ మినిస్టర్‌ను కాపాడేందుకు అతడికి సెక్యూరిటీగా అర్జున్ వర్మ ( వరుణ్ తేజ్) నియమించబడతాడు. అర్జున్ అన్వేషణలో సెంట్రల్ మినిస్టర్‌పై ఎటాక్ చేసింది రణ్‌వీర్ (వినయ్‌రాయ్) అనే నిజం బయటపడుతుంది.
సెంట్రల్ మినిస్టర్‌ను చంపడానికి రణ్ వీర్ ఎందుకు ప్రయత్నించాడు? విదేశాల నుంచి ఇండియాకు వస్తోన్న వందల కోట్ల మెడికల్ వేస్టేజీ వెనుక రణ్‌వీర్ హస్తం ఉందా? ఆ మెడికల్ వేస్టేజీ వల్ల దేశంలో ఎలాంటి అనర్థాలు తలెత్తుతున్నాయి? మినిస్టర్ ఆదిత్య రాజ్ బహదూర్ పర్సనల్ సెక్రెటరీ ఐరా (సాక్షి వైద్య) అర్జున్‌ను ప్రేమించిందా? వారిద్దరి బ్రేకప్‌కు కారణం ఏమిటి? అన్నదే గాండీవధారి అర్జున కథ.
ఇతర భాషలతో పోలిస్తే స్పై యాక్షన్ కథలు తెలుగు హీరోలకు అంతగా అచ్చిరావడం లేదు. ఈ జోనర్‌లో ఇటీవల కాలంలో వచ్చిన నిఖిల్ స్పై, అఖిల్ ఏజెంట్‌తో పాటు పలు సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. గాండీవధారి అర్జునతో ఫస్ట్ టైమ్ స్పై కథతో వరుణ్‌తేజ్ బాక్సాఫీస్ వద్ద తన లక్‌ను పరీక్షించుకున్నాడు. అతడికి సేమ్ రిజల్ట్ ఎదురైంది.
స్పై యాక్షన్ కథకు అంతర్లీనంగా గ్లోబల్ వార్నింగ్, మెడికల్ వేస్టేజీ పాయింట్‌ను టచ్ చేస్తూ గాండీవధారి అర్జున కథను రాసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ రొటీన్ పాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో హాలీవుడ్ టచ్ ఇస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నాడు.
లండన్ బ్యాక్‌డ్రాప్, గూఢచారి క్యారెక్టర్‌కు తగ్గ కటౌట్ ఉన్న హీరో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, అందమైన హీరోయిన్ ఉన్నా... బలమైన ఎమోషన్ ఎక్కడ సినిమాలో కనిపించదు. కమర్షియల్ హంగుల మధ్య కథ మరి గడ్డిపోచ అంత పలుచన అయిపోయింది. ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్‌కు సీక్వెల్‌గా గాండీవధారి అర్జున మారిపోయింది.
సెంట్రల్ మినిస్టర్‌పై ఎటాక్స్, అతడి మనవరాలిని హీరో సేవ్ చేయడం లాంటి సీన్స్ కథను డామినేట్ చేశాయి. మదర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో అసలైన స్టోరీ రివీలయ్యే ట్విస్ట్ బాగుంది. మరోవైపు హీరోయిన్‌తో అర్జున్ లవ్ ఎఫైర్ వెనుక ఫ్లాష్‌బ్యాక్ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు డైరెక్టర్. కానీ అవేవీ కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఎండ్ చేశారు.
అర్జున్ అనే ఏజెంట్ పాత్రకు వరుణ్‌తేజ్ పర్‌ఫెక్ట్ యాప్ట్‌గా నిలిచాడు. అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఏజెంట్‌తో పోలిస్తే సాక్షి వైద్యకు మంచి పాత్ర దక్కింది. ఐరా క్యారెక్టర్‌లో ఆమె యాక్టింగ్‌కు మంచి మార్కులే పడతాయి. విలన్ పాత్రలో వినయ్‌రాయ్ స్టైలిష్‌గా కనిపించాడు. కానీ అతడి క్యారెక్టర్ డిజైనింగ్, యాక్టింగ్‌లో కొత్తదనం కనిపించలేదు. నాజర్‌తో పాటు అభినవ్ గోమటం, విమలా రామన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు.
మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. స్పై మూవీ ఫీల్‌ను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేయలేకపోయాడు మిక్కీ జే మేయర్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
గాండీవధారి అర్జున రొటీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం బాగుంది. కానీ చెప్పిన తీరు కన్ఫ్యూజన్‌కు గురిచేస్తుంది.