Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు
Game Changer Trailer: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (జనవరి 2) హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా ట్రైలర్ ను దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు.
Game Changer Trailer: గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాంతికి వస్తున్న మెగా మూవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా కోసం మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 2) మూవీ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ లాంచ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గెస్టుగా రానున్నట్లు మేకర్స్ బుధవారం (జనవరి 1) వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ గురువారం సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ చెప్పారు. అయితే తాజాగా తమ ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రైడ్ రాజమౌళి రానున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా అతడు రాబోతున్నాడు. "డ్రమ్ రోల్ ప్లీజ్.. జనవరి 2న జరగనున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వన్ అండ్ ఓన్లీ రాజమౌళి కళ్లు చెదిర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేపు సాయంత్రం 5.04 గంటలకు కలుద్దాం" అనే క్యాప్షన్ తో మేకర్స్ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్ చివరిసారి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ లోనే నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులను కూడా మెప్పించింది. అలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ గేమ్ ఛేంజర్ తో మరోసారి చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ మూవీ గురించి..
గేమ్ ఛేంజర్ మూవీని తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం తెరకెక్కించాడు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మూడేళ్లుగా ఊరిస్తోంది. షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో చరణ్.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతని సరసన కియారా అద్వానా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పాటలు, టీజర్ వచ్చాయి.
ఇక ఇప్పుడు ట్రైలర్ కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేకర్స్.. ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ఓ మూవీ ఈవెంట్ కు తొలిసారి రాబోతున్నాడు. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో అతడు ఏం మాట్లాడబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న జరగనుంది.