Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. బెనిఫిట్ షోలకు నో
Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం నో చెప్పింది. మొత్తానికి దిల్ రాజు చేసిన ప్రయత్నాలతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట మార్చేయాల్సి వచ్చింది.
Game Changer Ticket Prices: తెలంగాణలోనూ గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల ధర పెంపుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇక నుంచి తెలంగాణలో ఇలాంటివి ఉండనవి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడీ మూవీకి మాత్రం అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ల ధరలు ఇలా..
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ శుక్రవారం (జనవరి 10) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు తెలంగాణలోనూ టికెట్ల ధర పెంపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మొత్తానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో అదనంగా రూ.150 పెంచేందుకు ఓకే చెప్పారు. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల షోతోపాటు ఆ రోజు మొత్తంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లలో టికెట్ పై రూ.100 పెంచనున్నారు.
జనవరి 11 నుంచి రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 మాత్రమే పెంచాలని స్పష్టం చేసింది. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీంతో గేమ్ ఛేంజర్ తొలి రోజు మాత్రం ఉదయం 4 గంటల షోలు వేయనున్నారు. అర్ధరాత్రి షోలు మాత్రం ఉండవు. ఏపీలో మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట షోలు వేయనున్న విషయం తెలిసిందే.
ఏపీలో ఇలా..
అటు గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోస్, టికెట్ల ధరల పెంపుకు అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ పెంచిన ధరలతో ఐదు షోలకే అనుమతి ఇచ్చారు.
టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఇటీవల పుష్ప 2 విడుదల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ విషయంలో కాస్త తక్కువగానే ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలు పుష్ప 2 బెనిఫిట్ షోలకు రూ.800..జీఎస్టీతో కలిపి రూ.1000 వరకు పెంచారు. మల్టీఫ్లెక్స్ లలో రూ.1200 వరకు పెంచారు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో జీఎస్టీతో కలిపి రూ.600(బెనిఫిట్ షో) ధరలు నిర్ణయించింది. మిగిలిన షోలకు మల్టీఫ్లెక్స్ లలో రూ.175(జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్ లో రూ.135(జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.