Game Changer: గేమ్ ఛేంజింగ్ డే అంటూ రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్.. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్
Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజింగ్ డే కాబోతోందంటూ చెర్రీ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం (జనవరి 10) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Game Changer: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మొత్తానికి ఊరించి ఊరించి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన పూర్తిస్థాయి మూవీ ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ శంకర్ డైరెక్షన్ కావడంతో దీనికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ఏపీలో బెనిఫిట్ షోల సందడి మొదలు కానుండగా.. కొన్ని గంటల ముందు మూవీపై చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
గేమ్ ఛేంజింగ్ డే
రామ్ చరణ్ తన మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ పై గురువారం (జనవరి 9) రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. "బిగ్ డే, గేమ్ ఛేంజింగ్ డే" అనే క్యాప్షన్ తో చరణ్ ఈ పోస్ట్ చేశాడు. దీనికి గేమ్ ఛేంజర్ గ్రాండ్ రిలీజ్ రేపే అనే పోస్టర్ ను జత చేశాడు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.
ఈ పోస్టర్లో చరణ్ చేతిలో ఓ సుత్తితో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చరణ్ ఈ పోస్ట్ చేసిన గంటలోనే కొన్ని లక్షల మంది లైక్ చేశారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ గుడ్ లక్ అంటూ కామెంట్ చేసింది. ఎంతో మంది అభిమానులు కూడా చరణ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ భారీ బడ్జెట్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్
గేమ్ ఛేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించిన స్థాయిలోనే భారీగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి రోజే ఇండియాలో రూ.30 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగులోనే 4.8 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇక హిందీలో 70 వేలకుపైగా, తమిళంలో 33 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి.
గేమ్ ఛేంజర్ కు అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలోనూ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో భారీగా ఉండగా.. తెలంగాణలో ఓ మోస్తరుగా ఉంది. ఇక ఏపీలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెనిఫిట్ షోలు వేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి అనుమతివ్వలేదు. కానీ ఉదయం 4 గంటల నుంచి తొలి రోజు మొత్తంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చారు.
టికెట్ల రేట్లను కూడా ఓ మోస్తరు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. సంక్రాంతి సినిమాగా వస్తున్న గేమ్ ఛేంజర్ కు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. ఆ రెండు సినిమాలకు కూడా ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి లభించింది. మరి ఈ మూడు సినిమాల్లో విజేతగా నిలిచే మూవీ ఏదన్నది చూడాలి.