Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇదే.. ఆ పండగకు ప్లాన్ చేసిన మేకర్స్
Game Changer Release Date: రామ్ చరణ్ అభిమానులను నిర్మాత దిల్ రాజు నిరాశపరిచినా.. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ రిపోర్ట్ వస్తోంది. క్రిస్మస్ పండగకు ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Game Changer Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై అప్డేట్ కోసం అభిమానులు ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ మూవీ రిలీజ్ డేట్ కాదు కదా.. ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంటి వాటిపై కూడా ఏ సమాచారం లేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఇదే అని తమకు సమాచారం అందిందంటూ ఓటీటీప్లే రిపోర్ట్ వెల్లడించింది.
క్రిస్మస్‌కు గేమ్ ఛేంజర్
ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మరో 30 శాతం మిగిలే ఉంది. మూడేళ్లుగా సాగుతూనే ఉన్న గేమ్ ఛేంజర్ మూవీని లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇదే సమయంలో అతడు ఇండియన్ 2 మూవీని కూడా చేస్తుండటంతో అది గేమ్ ఛేంజర్ పై ప్రభావం చూపింది. ఇప్పటికీ ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉందంటే సినిమా ఎంత నెమ్మదిగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. గతేడాది చివర్లో మైసూరులోనూ గేమ్ ఛేంజర్ షెడ్యూల్ సాగింది.
నిజానికి గతేడాది దీపావళికే ఈ సినిమా నుంచి జరగండి అనే ఫస్ట్ సింగిల్ రానున్నట్లు చెప్పారు. దీనికోసం రామ్ చరణ్ కలర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఏమైందోగానీ ఆ పాట కూడా బయటకు రాలేదు. ఇప్పుడూ అప్పుడూ అంటూ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే ఉంది. దీంతో డైరెక్టర్ శంకర్ ను చరణ్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు.
ఏమీ చెప్పని దిల్ రాజు
గేమ్ ఛేంజర్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నాడు. దీంతో అతడు పబ్లిగ్గా ఎప్పుడు కనిపించినా ఈ సినిమాపై ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా లవ్ మీ అనే మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అతడు మాట్లాడాడు. అయితే ముందుగానే ఈ సినిమా గురించి తప్ప గేమ్ ఛేంజర్ గురించి ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పి ఉసూరుమనిపించాడు.
దీంతో ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతోందో అన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లుగా రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కనిపించిన మరో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు ఈ గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చరణ్ మూవీ చేస్తున్నాడు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా కాగా.. జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ నటిస్తోంది. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ చెప్పినా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.