Game Changer Release: గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ గురించి చెప్పేసిన దిల్‍రాజు.. ఆ నెలలోనే అంటూ..
Game Changer Movie Release: గేమ్ ఛేంజర్ సినిమా విడుదల గురించి నిర్మాత దిల్‍రాజు ఎట్టకేలకు స్పందించారు. ఏ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో వెల్లడించారు.
Game Changer Movie Release: ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ హిట్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ హీరో రామ్‍చరణ్ తేజ్.. గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. చాలా బ్రేక్‍లు పడుతూనే ఉన్నాయి. దీంతో అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అంచనా లేక రామ్‍చరణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే, గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవనుందో దిల్‍రాజు తాజాగా చెప్పారు.
గేమ్ ఛేంజర్ సినిమా 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్‍రాజు చెప్పారు. సలార్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్నఆయనను గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ ఎప్పుడని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనికి దిల్‍రాజు స్పందించారు. సెప్టెంబర్.. సెప్టెంబర్ అని చెప్పారు.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తొలి పాట దీపావళికే తెస్తామని గతంలో మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ జరగండి పాటకు సంబంధించిన పోస్టర్లతోనూ హడావుడిగా చేసింది. అయితే, ఆఖరి నిమిషంలో వెనక్కి వెళ్లింది. పాట రిలీజ్‍ను వాయిదా వేసింది. ఆ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది కనీసం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఎలాంటి అప్‍డేట్స్ ఇవ్వడం లేదు. గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
భారతీయుడు-2 చిత్రాన్ని కూడా శంకర్ చేస్తుండడం గేమ్ ఛేంజర్ ఆలస్యానికి కారణమవుతోంది. గేమ్ ఛేంజర్ షూటింగ్‍కు చాలాసార్లు విరామాలు పడ్డాయి. దీంతో అసలు ఈ సినిమా 2024లో రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటికే 2023లో రామ్‍చరణ్ మూవీ ఒక్కటి కూడా రాలేదు. 2024లో కూడా రాదా అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే, 2024 సెప్టెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తామని ఇప్పుడు దిల్‍రాజు ప్రకటించారు. మరి, ఇదైనా సాధ్యమవుతుందేమో చూడాలి.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.