Game Changer HD print Leak: గేమ్ ఛేంజర్ హెచ్‍డీ ప్రింట్ లీక్ వెనుక 45 మంది ముఠా.. వారి వెనుక ఎవరైనా అంటూ టీమ్ అనుమానాలు
Game Changer Online HD print Leak Issue: గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ లీక్ అవడం గురించి మూవీ టీమ్ స్పందించింది. దీని వెనుక ఓ ముఠా కుట్ర ఉందనేలా వెల్లడించింది. మరిన్ని అనుమానాలను లేవనెత్తింది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. జనవరి 10వ తేదీన ఈ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా హెచ్‍డీ ప్రింట్ ఆన్‍లైన్‍లో లీక్ అవడం సంచలనంగా మారింది. థియేటర్లలో రిలీజైన ఒక్క రోజులోనే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ ప్రింట్ వచ్చేసింది. ఈ విషయంపై గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ స్పందించింది. దీని వెనుక ఓ ముఠా ఉందంటూ మరిన్ని విషయాలను వెల్లడించింది.

45 మంది ముఠా.. ముందే బెదిరింపులు
గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ లీక్ విషయంపై మూవీ టీమ్ నేడు ప్రెస్‍నోట్ రిలీజ్ చేసింది. దీని వెనుక 45 మందితో కూడిన ముఠా ఉందని వెల్లడించింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆన్‍లైన్‍లో హెచ్‍డీ ప్రింట్ లీక్ చేస్తామని రిలీజ్‍కు ముందే తమను వారు బెదిరించారని పేర్కొంది.
గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాతలతో పాటు మూవీ టీమ్‍లోని కొందరికి వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని వెల్లడించింది. “గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే నిర్మాతలతో పాటు టీమ్‍లోని కీలక వ్యక్తుల్లో కొందరికి.. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా కొందరి నుంచి బెదిరింపులు వచ్చాయి. అడిగిన డబ్బు ఇవ్వకపోతే పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారు” అని మూవీ టీమ్ వెల్లడించింది. ఆన్‍లైన్లో లీక్ చేయటంతో పాటు టెలిగ్రామ్, సోషల్ మీడియాలోనూ ఆ ముఠా షేర్ చేసిందని తెలిపింది.
వాళ్ల వెనుక ఎవరైనా ఉన్నారా?
సోషల్ మీడియాలో ముందే ట్విస్టులను రివీల్ చేయడంపై కూడా గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ అనుమానాలు వ్యక్తం చేసింది. కావాలనే ఆ 45 మంది ఈ చిత్రంపై నెగెటివిటీ వ్యాప్తి చేశారా అని కూడా భావిస్తున్నట్టు ప్రెస్‍నోట్‍లో పేర్కొంది. “ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ ఛేంజర్ చిత్రంపై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ల వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది” అని మూవీ టీమ్ అనుమానాలు వ్యక్తం చేసింది.
45 మందిపై ఫిర్యాదు
గేమ్ ఛేంజర్ సినిమాను ఆన్‍లైన్‍లో లీక్ చేస్తామని బెదిరించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చినట్టు పేర్కొంది. లీక్ వెనుక ఆ ముఠానే ఉందని ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. దర్యాప్తు తర్వాత ఈ విషయంపై నిజానిజాలు బయటికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమాపై ప్లాన్ ప్రకారం నెగెటివిటీ స్ప్రెడ్ చేసి, ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసిన సోషల్ మీడియా పేజీలపై కూడా కంప్లైట్ ఇచ్చినట్టు గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ వెల్లడించింది.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. సుమారు రూ.350కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందించారని అంచనా. ఈ మూవీలో రామ్‍చరణ్‍తో పాటు అంజలి, కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం