Director Shankar: గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ లేటెస్ట్ కామెంట్లు.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Director Shankar on Game Changer: గేమ్ ఛేంజర్‌పై ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ ఫుటేజ్ నుంచి కొన్ని సీన్లు తీసివేయడం దగ్గరి నుంచి మరిన్ని విషయాలపై మాట్లాడారు. దీంతో ఆయనపై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బోలెడు అంచనాలను నెలకొల్పింది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ మంచి హైప్ తెచ్చుకుంది. సంక్రాంతి రేసులో ముందుగా జనవరి 10వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, గేమ్ ఛేంజర్ చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వస్తోంది. శంకర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ తరుణంలో ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు శంకర్.
మంచి రివ్యూలే వస్తున్నాయ్
గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏవైనా యూట్యూబ్, ఆన్‍లైన్ రివ్యూలు చూశారా అని డైరెక్టర్ శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తాను ఏ రివ్యూలు కూడా చూడలేదని, అయితే మంచి రివ్యూలే వస్తున్నాయని తన వినిపిస్తోందని చెప్పారు.
ఏకంగా ఐదు గంటల ఫుటేజ్
గేమ్ ఛేంజర్ సినిమా ఔట్‍పుట్ పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని డైరెక్టర్ శంకర్ అన్నారు. ఈ చిత్రానికి మొత్తంగా 5 గంటల ఫుటేజ్ వచ్చిందని తెలిపారు. దీంతో రన్‍టైమ్ తగ్గించేందుకు ట్రిమ్ చేయడంతో ముఖ్యమైన ప్రభావవంతమైన ఎపిసోడ్స్ తీసేయాల్సి వచ్చిందని అన్నారు.
నెటిజన్ల ట్రోలింగ్
శంకర్ చేప్పిన విషయాలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓ పక్క గేమ్ ఛేంజర్ మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంటే.. అంతా మంచిగానే ఉందని ఎలా అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓ మూవీకి ఐదు గంటల ఫైనల్ ఫుటేజ్ చేయడం ఏంటని అంటున్నారు. మూవీ ఓ ఫ్లోలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్‌దేనని, ముఖ్యమైన సీన్లు తీసేశామని ఎలా చెబుతారని పోస్టులు చేస్తున్నారు. రివ్యూలను పట్టించుకోకుండా ఉండడం సరికాదని, చేసిన పొరపాట్లను తెలుసుకోవాలి కదా అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా శంకర్ చేసిన తాజా కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దిగ్గజ డైరెక్టర్‌గా పేరొందిన శంకర్.. రోబో తర్వాతి నుంచి ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా గతేడాది ఇండియన్ 2 చిత్రంతో తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ అసంతృప్తికి గురిచేశారు. ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఈ మూవీ షూటింగ్ చేసి.. పెద్దగా మెప్పించలేకపోయారు. కొన్ని సీన్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు మినహా గేమ్ ఛేంజర్ మూవీ పెద్దగా ఆసక్తికరంగా లేదనే మిక్స్డ్ టాక్ ఎక్కువగా వచ్చింది. ఇది కలెక్షన్లపై ప్రభావం పడింది.
గేమ్ ఛేంజర్‌ను పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ తెరకెక్కించారు. ఈ మూవీని రూ.300కోట్లకు పైగా బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశారు దిల్‍రాజు, శిరీష్. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో రామ్‍చరణ్‍తో పాటు కియారా అడ్వానీ, అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం రెండు పాత్రలు చేశారు చెర్రీ. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం
టాపిక్