Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రికార్డులు అనుకుంటే సీన్ రివర్స్
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం ఈ మూవీ 51 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ అత్యధికంగా 42 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
Game Changer Day 1 Collections: గేమ్ ఛేంజర్ మూవీ తొలి రోజే కలెక్షన్స్ విషయంలో అంచనాల్ని అందుకోలేక డీలా పడింది. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించారు. పుష్ప 2తో పాటు పలు సినిమాల రికార్డులను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ తొలిరోజే సినిమాపై దారుణంగా నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై గట్టిగానే పడింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజర్ మూవీ 51 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
తెలుగులో 42 కోట్లు...
మొదటి రోజు గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ అత్యధికంగా 42 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. హిందీ వెర్షన్‌కు ఏడు కోట్లు,తమిళ వెర్షన్ రెండు కోట్ల పది లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
కన్నడ, మలయాళంలో గేమ్ ఛేంజర్ మూవీ దారుణంగా నిరాశపరిచింది. రెండు భాషల్లో కలిపి ఈ మూవీ లక్షన్నర నుంచి రెండు లక్షల లోపే వసూళ్లను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు. రెండో రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వంద కోట్లు అనుకుంటే...
రామ్ చరణ్, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా తొలిరోజు 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందులో సగం కూడా గేమ్ ఛేంజర్ వసూళ్లను రాబట్టలేకపోయింది. రామ్‌చరణ్ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 223 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. ఆ సినిమాకు గేమ్ ఛేంజర్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
శంకర్ గత మూవీ ఇండియన్ 2 కూడా తొలిరోజు యాభై కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. గేమ్ ఛేంజర్ కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టడం అభిమానులకు షాకింగ్‌గా మారింది. వరల్డ్ వైడ్‌గా 225 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజైంది.తొలిరోజు కలెక్షన్స్‌తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది.
శంకర్‌పై విమర్శలు...
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించాడు. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, శంకర్ మార్కు స్క్రీన్‌ప్లే మిస్సవ్వడం సినిమాకు మైనస్‌గా మారింది. శంకర్ టేకింగ్‌పై దారుణంగా విమర్శలొస్తున్నాయి.
మరోవైపు రామ్‌చరణ్ నటనను మాత్రం అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. అప్పన్న పాత్రలో అదరగొట్టాడని, ఐఏఎస్ రామ్‌నందన్ క్యారెక్టర్‌లో స్టైలిష్‌గా కనిపించాడని అంటున్నారు. గేమ్ ఛేంజర్ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్...
గేమ్ ఛేంజర్ మూవీని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జేసూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.