Movies tickets Rates Hikes: సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల టికెట్ల ధరలు పెంపు.. జీవోలు జారీ.. ఏ సినిమాకు ఎంత?
Sankranthi Movies tickets Rates Hikes: సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల టికెట్ ధరను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. మూడు చిత్రాలకు సంబంధించిన జీవోలు కూడా వచ్చేశాయి. ఈ సినిమాకు పెంపు ఎంత ఉందంటే..
ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ ఉంది. ముందుగా ఈ రేసులో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం రానుంది. పండుగకు ముందే జనవరి 10వ తేదీన ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. రెండు రోజుల గ్యాప్‍లో జనవరి 12న నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇలా ఈ మూడు చిత్రాలు ఈసారి సంక్రాంతి పండుగ బరిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. జీవోలను జారీ చేసింది.
గేమ్ ఛేంజర్‌కు ఇలా.. బెనెఫిట్ షో కూడా..
గేమ్ ఛేంజర్ చిత్రానికి ఎక్కువ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.135 ధరను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జనవరి 10 నుంచి 14 రోజుల పాటు ఈ పెరిగిన ధరలు ఉంటాయి.
గేమ్ ఛేంజర్ చిత్రానికి బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు ఈ షో ఉండనుంది. ఈ బెనెఫిట్ షోకు టికెట్ ధరను రూ.600 పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసింది. ఇక, గేమ్ ఛేంజర్ మూవీకి తొలి రోజు ఆరు షోలు, ఆ తర్వాతి రోజు నుంచి ఐదు షోలు ఉండనున్నాయి.
డాకు మహారాజ్.. తెల్లవారుజామున బెనెఫిట్ షో
డాకు మహారాజ్ చిత్రానికి కూడా అధిక రేట్లకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‍పై రూ.135, సింగిల్ స్క్రీన్‍లలో రూ.110 అదనపు ధర ఉండనుంది. రిలీజ్ నుంచి 14 రోజుల పాటు ఎక్స్‌ట్రా రేట్లు ఉండనున్నాయి. డాకు మహారాజ్ మూవీకి జనవరి 12న తెల్లవారుజామున 4 గంటలకు బెనెఫిట్ షో పడనుంది. డాకు మహారాజ్ స్పెషల్ షోకు టికెట్ ధరను రూ.500గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ కూడా అదనంగా ఉంటుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ధర పెంపు ఇలా..
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. ఈ మూవీకి కూడా టికెట్ రేట్ల పెంపునకు ఏపీ పర్మిషన్ ఇచ్చేసింది. ఒక్కో టికెట్‍పై మల్టీప్లెక్సుల్లో రూ.125, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 అదనంగా పెంచుకునేందుకు మేకర్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండు వారాలు ఈ అదనపు ధరలను ఉంచుకోవచ్చు. రోజుకు ఐదు షోలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బెనెఫిట్ షో లేదు.
సినిమాలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఎందుకు అవసరమో గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. చిత్రాల బడ్జెట్ పెరిగిపోతున్న కారణంగానే అదనపు టికెట్ రేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోందన్నారు. డిమాండ్, సప్లై సూత్రం వీటికి కూడా వర్తిస్తుందని చెప్పారు. సినిమా టికెట్లతో జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందనే విషయాన్ని పవన్ గుర్తు చేశారు.
మరోవైపు, సినిమాలకు బెనెఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.
సంబంధిత కథనం