Game Changer Advance Bookings: మొదలైన గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. నెల రోజుల ముందే రామ్ చరణ్ హంగామా
Game Changer Advance Bookings: గేమ్ ఛేంజర్ హంగామా నెల రోజుల ముందే మొదలైంది. సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కావడం విశేషం.
Game Changer Advance Bookings: తెలుగులో మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటైన గేమ్ ఛేంజర్.. సరిగ్గా మరో నెల రోజుల్లో అంటే జనవరి 10న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. యూకేలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ తో బుకింగ్స్ మొదలయ్యాయి.
గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్
మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన పూర్తి స్థాయి మూవీ ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. దీంతో గేమ్ ఛేంజర్ ఎప్పుడెప్పుడా అని అతని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ యూకేలో మొదలయ్యాయి. ఆ దేశంలో జనవరి 9నే ప్రీమియర్ షో పడనుంది. అక్కడి కేంబ్రిడ్జ్ లోని ప్రతిష్టాత్మక ది లైట్ సినిమాస్ చెయిన్ లో ఈ టికెట్ల బుకింగ్ సోమవారమే (డిసెంబర్ 9) ప్రారంభమైంది. ఇప్పటికే ఒక షో టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. మిగిలిన షోలకు కూడా చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయి.
నిజానికి ఇప్పటికే సినీవరల్డ్ చెయిన్ లోనూ గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అందులోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక అక్కడి ఒడియన్ సినిమాస్, ఇతర చెయిన్స్ కూడా త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనున్నాయి. యూకేలో ఈ మూవీని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ యూకే రిలీజ్ చేస్తోంది.
గేమ్ ఛేంజర్ మూవీ గురించి..
గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కూడా. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఈ మూవీ మొదలైంది. కానీ మొదట కొవిడ్, ఆ తర్వాత ఇండియన్ 2 షూటింగ్ లో శంకర్ బిజీగా మారడంతో గేమ్ ఛేంజర్ వాయిదా పడుతూ వస్తోంది.
మొత్తానికి వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజైన విషయం తెలిసిందే. జరగండి, నానా హైరానా పేరుతో రిలీజైన ఈ రెండు పాటలూ మంచి హిట్ అయ్యాయి. తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీతోపాటు ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీకి పోటీ కాస్త గట్టిగానే ఉండనుంది. సంక్రాంతికే వెంకటేశ్, బాలకృష్ణ నటిస్తున్న మూవీస్ కూడా వస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న డాకూ మహరాజ్ మూవీ జనవరి 12, వెంకటేశ్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 15న సందీప్ కిషన్ మూవీ మజాకా కూడా రాబోతోంది.
టాపిక్