GAMA Awards 2025: దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?-gama awards 2025 fifth edition will held in dubai on june 7th announcement telugu directors were jury members ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gama Awards 2025: దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?

GAMA Awards 2025: దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Published Feb 18, 2025 06:29 AM IST

GAMA Awards 2025 Date And Venue: ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ 2025 వేడుకలను జూన్ 7న దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇటీవల గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ ద్వారా తెలిపారు. ఇందులో 500 మందికిపైగా తెలుగు వారు హాజరయ్యారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా డైరెక్టర్స్, సంగీత దర్శకులు ఉండనున్నారు.

దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?
దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?

GAMA Awards 2025 5th Edition: గామా అవార్డ్స్ 2025 (Gulf Academy Movie Awards/GAMA) 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని గామా ప్రాముఖ్యతను తెలిపారు.

జూన్ 7న దుబాయ్‌లో

మొట్టమొదటిసారిగా, సరికొత్తగా, వినూత్నంగా గామా గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె సమక్షంలో గామా అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించే తేది, స్థలం, జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. గామా అవార్డ్స్ 2025 ఐదో ఎడిషన్‌ను జూన్ 7న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించనున్నారు.

కళాకారులకు అవార్డ్స్

ఈ ఫంక్షన్‌లో జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, సినీ దర్శకుడు, బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు గామా అవార్డ్స్‌ను ప్రదానం చేస్తారు. ఈ విషయాన్ని అందరికీ అద్భుత అనుభూతిని కలిగించేలా అనౌన్స్‌మెంట్‌ను చేశారు.

ఐదో ఎడిషన్ అవార్డ్స్

ఈ సందర్భంగా గామా అవార్డ్స్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ, గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న గామా ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్‌కు ప్రముఖ సినీ పెద్దలను, కళాకారులను విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తున్నామని, దుబాయ్‌లోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.

వినూత్నంగా వినోదభరితంగా

అలాగే, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. యూఏఈలో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి తెలుగు వారికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అలాగే, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. బహుమతుల ప్రదానోత్సవం వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.

ఓటింగ్ ప్రక్రియ

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ (THE GAMA EXCELLENCE AWARDS) ఇచ్చి సత్కరించనున్నామని సౌరభ్ కేసరి వెల్లడించారు. ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందని, నామినేటెడ్ అయిన విభాగాలకు పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వీడియో మేసెజెస్

కాగా ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న ఏ. కొదండ రామిరెడ్డి (దర్శకుడు), కోటి (సంగీత దర్శకుడు), బి. గోపాల్ (దర్శకుడు) ప్రత్యేకంగా పంపిన వీడియో సందేశాలు పంపించారు. వీరి సందేశంలో.. ప్రతి ఒక్కరూ గామా గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి వెల్లడించారు.

మంచి వసతులతో

రఘు కుంచె మాట్లాడుతూ.. "తెలుగు ఇండస్ట్రీలో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ గామా ఈవెంట్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళాకారులు అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు" అని తెలిపారు.

 

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం