Furiosa OTT Streaming: హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. తెలుగులోనూ చూడొచ్చు
Furiosa OTT Streaming: సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ మూవీ ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ఇండియాలోనూ ఓటీటీలోకి వచ్చేసింది. రెండు ఓటీటీల్లో ఉన్న ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు.
Furiosa OTT Streaming: హాలీవుడ్ లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఈ ఏడాది వచ్చిన మూవీ ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇండియాలో రిలీజైనా.. బాక్సాఫీస్ దగ్గర ఊహించినన్ని వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఇండియాలోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఫ్యూరియోసా ఓటీటీ స్ట్రీమింగ్
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీని జార్జ్ మిల్లర్ డైరెక్ట్ చేశాడు. అన్యా టేలర్ జాయ్, క్రిస్ హెమ్స్‌వర్త్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్‌మైషో స్ట్రీమ్ లోనూ అందుబాటులోకి రావడం విశేషం. అంతేకాదు కేవలం ఇంగ్లిష్ లోనే కాదు.. తెలుగుతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను చూడొచ్చు.
అయితే ఈ సినిమాను ఓటీటీలో ఫ్రీగా చూసే అవకాశం లేదు. ఎర్లీ యాక్సెస్ పేరుతో ప్రైమ్ వీడియో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యూహెచ్‌డీ క్వాలిటీతో ఈ మూవీ చూడాలనుకుంటే రూ.499 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉంది. మ్యాడ్ మ్యాక్స్ సినిమాలకు మీకు ఇష్టమైతే, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయి ఉంటే వెంటనే ప్రైమ్ వీడియోలో చూసేయండి.
ఈ ఫ్యూరియోసా మూవీని డౌగ్ మిచెల్, జార్జ్ మిల్లర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీలో అలియా బ్రౌన్, టామ్ బుర్కీ, లాచీ హుల్మెలాంటి వాళ్లు కూడా నటించారు.
మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీ
మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీ నుంచి తొలిసారి 1979లో సినిమా వచ్చింది. ఇప్పటి వరకూ మొత్తంగా ఐదు సినిమాలు వచ్చాయి. 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2, 1985లో మ్యాడ్ మ్యాక్స్ బియాండ్ థండర్‌స్టార్మ్, 2015లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్, తాజాగా 2024 మేలో ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా సినిమాలు వచ్చాయి. సినిమాలే కాదు నవలలు, వీడియో గేమ్స్ కూడా రావడం విశేషం.
అయితే లేటెస్ట్ మ్యాడ్ మ్యాక్స్ మూవీ అయిన ఫ్యూరియోసా మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఈ సినిమాను 168 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 171.4 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. మే 23వ తేదీన తొలిసారి ఆస్ట్రేలియాలో రిలీజైన ఈ సినిమా.. నెలన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.