Ram Charan: రామ్ చరణ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం.. నాటు నాటు స్టెప్ వేయాలని ఉందంటూ..
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనితో ఓ ఈవెంట్ సందర్భంగా ఫొటో దిగిన కైఫ్.. అందరినీ గర్వపడేలా చేశావని కామెంట్ చేయడం విశేషం.

Ram Charan: రామ్ చరణ్, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను కైఫ్ మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ తో నాటు నాటు స్టెప్పులు వేయాలని ఉందన్న అతడు.. ఆర్ఆర్ఆర్ స్టార్ పై ప్రశంసలు కురిపించాడు. ఐఎస్‌పీఎల్ టీ10 ప్రారంభం సందర్భంగా ఈ ఇద్దరూ కలిశారు.
రామ్ చరణ్‌తో మహ్మద్ కైఫ్
టీమిండియాలో ఒకప్పుడు మెరుపు ఫీల్డర్ గా, మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్ గా ఎదిగిన మహ్మద్ కైఫ్.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిశాడు. ఈ సందర్భంగా అతనితో దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. "అతన్ని కలిసినప్పుడు అతనితో నాటు నాటు స్టెప్ వేయాలని అనుకుంటారు. ఓ పెద్ద గ్లోబల్ సూపర్ స్టార్ కానీ చాలా సింపుల్ గా ఉంటారు. మా అందరినీ మీరు గర్వపడేలా చేశారు. మీకు మరిన్ని హిట్స్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని కైఫ్ పోస్ట్ చేశాడు.
ఐఎస్‌పీఎల్ టీ10 క్రికెట్ లీగ్ రెండో సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఇద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు. ముంబైలోని దాదోజీ కొండేవ్ స్టేడియంలో ఈ టోర్నీ మొదలైంది. తన టీమ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ ను చీర్ చేసేందుకు అతడు ముంబై వెళ్లాడు. ఈ టీ10 టోర్నీ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను చరణ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
రామ్ చరణ్ రాబోయే మూవీ..
ఈ మధ్యే రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అసలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఇక గత వారమే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. అయితే మూడు, నాలుగు రోజుల తర్వాతగానీ ప్రైమ్ వీడియోలోనూ ట్రెండింగ్ లోకి రాలేకపోయింది.
ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఈ మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ సెట్లోకి స్పెషల్ గెస్ట్ వచ్చిందంటూ తన కూతురు క్లిన్ కారాను ఎత్తుకున్న ఫొటోను కూడా రామ్ చరణ్ షేర్ చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం