Aakash Chopra on Chhaava: ఇదో గొప్ప సినిమా.. మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు లేదు: ఛావాపై టీమిండియా మాజీ క్రికెటర్
Aakash Chopra on Chhaava: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు ఎలాంటి సమాచారం లేదని ప్రశ్నించాడు.

Aakash Chopra on Chhaava: బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు మొత్తం దేశంలో సంచలనం రేపుతున్న మూవీ ఛావా (Chhaava). విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ధీరత్వానికి చెందిన ఓ అత్యద్భుతమైన కథ ఇది అని అతడు అన్నాడు.
ఛావా మూవీపై ఆకాశ్ చోప్రా ఏమన్నాడంటే?
ఛావా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సినిమాను ప్రశంసించాడు. సోమవారం (ఫిబ్రవరి 17) మూవీని చూసిన అతడు.. తన ఎక్స్ అకౌంట్లో రివ్యూ పోస్ట్ చేశాడు.
"ఛావా మూవీ ఈరోజు చూశాను. ధీరత్వం, నిస్వార్థం, విధి నిర్వహణ పట్ల ఉండే నిబద్ధతకు సంబంధించిన అద్భుతమైన స్టోరీ ఇది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. ఎందుకు మన స్కూల్ పుస్తకాల్లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ప్రస్తావించలేదు? ఎక్కడా పేరు కూడా లేదు. అక్బర్ గొప్ప చక్రవర్తి అని చదువుకున్నాం. ఢిల్లీలో ఓ రోడ్డుకు ఔరంగాజేబు పేరు కూడా పెట్టారు. అది ఎందుకు, ఎలా జరిగింది?" అని ప్రశ్నించాడు.
ఛావా మూవీ బాక్సాఫీస్
ఛావా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ దాటి రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు దగ్గరైంది. ఈ ఛావా సినిమాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా.. ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించింది.
ఈ సినిమాకు తొలి రోజు నుంచే ప్రశంసలు దక్కుతున్నాయి. మూవీలో అక్షయ్ ఖన్నా.. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు పాత్ర పోషించాడు. విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ ఛావా నిలవగా.. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ కూడా ఖుషీగా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్