సీనియర్ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ మీద ఫిష్ వెంకట్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కు సాయం చేయాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు స్పందించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని వెంకట్ కూతురు చెప్పింది.
ఫిష్ వెంకట్ కు కిడ్నీ ఇచ్చేందుకు డోనర్ దొరకడం లేదు. మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం ఫ్యామిలీ సభ్యులు వెతుకుతున్నారు. వివిధ కారణాల వల్ల కుటుంబంలో ఎవరూ కిడ్నీ దానం చేయలేకపోతున్నారని, దాత దొరకడం లేదని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి చెప్పింది. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా మా నాన్న కోసం కిడ్నీ దాతను కనుగొనడంలో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. వారందరితో కలిసి మా నాన్న మంచి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి అందరూ మా నాన్నకు సాయం చేయాలని కోరుతున్నాను’’ అని స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభాస్ టీమ్ తమను సంప్రదించి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిందని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి వెల్లడించింది. ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం తమకు కనీసం రూ.50 లక్షలు అవసరమని, అందుకు ప్రభాస్ సాయం చేయడానికి ముందుకొచ్చారని తెలిపింది. "డాడీకి ఒంట్లో బాగోలేదు. ఆయన చాలా సీరియస్ గా ఐసీయూలో ఉన్నారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం. దీనికి కనీసం రూ.50 లక్షలు ఖర్చవుతుంది. ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆపరేషన్ ఎప్పుడో చెప్తే డబ్బు అందిస్తామన్నారు’’ అని స్రవంతి చెప్పింది.
గతంలో ఫిష్ వెంకట్ కు పవన్ కల్యాణ్ సాయం చేశారు. పవన్ రూ.2 లక్షలు ఇచ్చారని గతంలో వెంకట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక చిరంజీవి కూడా గతంలో హెల్ప్ చేస్తానని చెప్పారని వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ ఓ ఫ్రెండ్ మాట విని చిరంజీవి దగ్గరకు వెంకట్ వెళ్లలేదని అంటున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ తో కలిసి ఫిష్ వెంకట్ నటించారు. బన్నీ, అదుర్స్, ఢీ, మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన ఇటీవల ఆహా థ్రిల్లర్ చిత్రం కాఫీ విత్ ఎ కిల్లర్ లో కనిపించారు. కరోనా సమయంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి 'మా వింత గాధ వినుమ', 'డీజే టిల్లు' చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.
సంబంధిత కథనం