Independence Day Movie: ఆగస్ట్ 15, 1947లో రిలీజైన సినిమా ఇది.. స్వతంత్ర భారత తొలి మూవీ ఓ బాక్సాఫీస్ హిట్.. వసూళ్లు ఇలా?
Independence Day Movie: స్వతంత్ర భారతదేశంలో రిలీజైన తొలి సినిమా ఏదో తెలుసా? ఈ మూవీ సరిగ్గా ఆగస్ట్ 15, 1947న రిలీజైంది. దేశం రెండు వందల ఏళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సమయంలో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పుడు 78వ ఇండిపెండెన్స్ రోజు గుర్తు చేసుకుందాం.
Independence Day Movie: దేశమంతా గురువారం (ఆగస్ట్ 15) దేశ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుల గురించి ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. అయితే సినిమా రంగానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకుందాం. అది స్వతంత్ర భారతదేశ తొలి సినిమా కావడం విశేషం.
ఇండిపెండెన్స్ డే మూవీ
మనకు స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ 15, 1947 ఏ వారమో తెలుసా? శుక్రవారం. సినిమా ఇండస్ట్రీలో ఈ వారానికి ఉన్న ప్రత్యేకత గురించి కూడా మనకు తెలుసు. మన దేశంలో 1920ల నుంచి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా వస్తోంది.
అలా ఆగస్ట్ 15, 1947 నాడు కూడా ఒక సినిమా రిలీజైంది. అది మన స్వతంత్ర భారతదేశంలో రిలీజైన తొలి చిత్ర కావడం గమనార్హం. నిజానికి ఆ రోజు రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి పెద్ద హిట్ అయిన సినిమా.
షెహనాయీ.. తొలి హిట్ మూవీ
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రోజే రిలీజై హిట్ కొట్టిన మూవీ పేరు షెహనాయీ. పీఎల్ సంతోషి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రెహానా, నాసిర్ ఖాన్ (దిలీప్ కుమార్ సోదరుడు) నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెసైంది. సుమారు రూ.కోటి వరకు వసూలు చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా నిలిచింది.
అయితే ఇండిపెండెంట్ ఇండియాలో విజయవంతమైన తొలి సినిమా రికార్డు మాత్రం ఈ షెహనాయీకే దక్కుతుంది. ఈ సినిమా చూడటానికి అప్పటి జనం రోజుల తరబడి సినిమా హాల్స్ ముందు క్యూ కట్టేవారని అప్పటి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సినిమా ద్వారా రెహానా ఓ పెద్ద స్టార్ గా ఎదిగింది. ఆమె అదే 1947లో అశోక్ కుమార్ తో కలిసి సజన్ మూవీతోనూ సక్సెస్ సాధించింది.
ఆ సినిమాలో స్టార్ సింగర్
షెహనాయీ మూవీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఇందులో ఓ స్టార్ సింగర్ కూడా నటించాడు. అతని పేరు అభాస్ కుమార్ గంగూలీ. ఈ పేరు ఎప్పుడూ విన్నట్టు లేదు కదా. కిశోర్ కుమార్ తెలుసా?
ఆ గంగూలీయే తర్వాత ఇండస్ట్రీలో కిశోర్ కుమార్ గా ఎదిగి ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ సింగర్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఇక ఆగస్ట్ 15, 1947న రిలీజైన మరో మూవీ మేరా గీత్. ఈ మూవీలో సుశీల్ కుమార్, జూనియర్ నసీమ్ నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.