First 1 Crore Remuneration Heroine: ఇండియాలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరో చిరంజీవి.. తొలి హీరోయిన్ ఎవరంటే?
First 1 Crore Remuneration Heroine: ఇండియాలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మన తెలుగు నటే. ఈమె ముందు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నిలవలేకపోయారంటే ఆమె హవా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు.

First 1 Crore Remuneration Heroine: మన దేశంలో రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కోసం అతడు ఈ మొత్తం అందుకున్నాడు. మరి ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె కూడా ఇటు టాలీవుడ్ తోపాటు అటు బాలీవుడ్ ను ఏలిన తెలుగు నటే కావడం విశేషం.
రూ.కోటి రెమ్యునరేషన్ హీరోయిన్ శ్రీదేవి
తెలుగు స్టార్లు, తెలుగు సినిమాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకమే. రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నది మన మెగాస్టార్ చిరంజీవియే. అంతేకాదు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ శ్రీదేవి.
ఒకప్పుడు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా ఏలిన ఈ అందాల నటి అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకుంది. నిజానికి తొలి పాన్ ఇండియా స్టార్ కూడా ఆమెనే అని చెప్పొచ్చు. 1993లో వచ్చిన రూప్ కీ రాణీ చోరోంకా రాజా అనే మూవీ కోసం శ్రీదేవి రూ.కోటి అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో అత్యంత భారీ బడ్జెట్ ఇండియన్ సినిమాల్లో ఇదీ ఒకటి.
అమితాబ్ బచ్చన్ కూడా ఆమె తర్వాతే..
1990ల్లోనే ఇండియాలో చిరంజీవి కాకుండా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. కానీ వాళ్లెవరూ శ్రీదేవి అందుకున్న రెమ్యునరేషన్ కూడా అందుకోలేదు. చిరంజీవి, శ్రీదేవి తర్వాతే అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు ఈ మార్క్ అందుకోవడం విశేషం.
1993లో రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్నప్పటి నుంచీ అనూహ్యంగా 1997లో సినిమాల నుంచి తప్పుకున్నప్పటి వరకూ తాను నటించిన మూవీస్ లో హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న ఘనత శ్రీదేవిదే. అంతెందుకు 1990ల్లో బాలీవుడ్ ను ఏలడం ప్రారంభించిన ఖాన్ త్రయం షారుక్, ఆమిర్, సల్మాన్ కూడా రూ.75 లక్షల రెమ్యునరేషన్ తోనే సరిపెట్టుకున్నారు. శ్రీదేవి రిటైర్మెంట్ తర్వాతే ఖాన్‌లు కూడా ఈ రూ.కోటి మార్క్ అందుకున్నారు.
33 ఏళ్ల వయసులోనే సినిమాలకు గుడ్‌బై
శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీలను దశాబ్దాల పాటు ఏలింది. కానీ అనూహ్యంగా 33 ఏళ్ల వయసులోనే 1997లో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఆ సమయానికి ఆమె బోనీ కపూర్ తో తొలి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతోంది.
1997లో వచ్చిన జుదాయి మూవీ అప్పట్లో ఆమెకు చివరిది. మళ్లీ 15 ఏళ్ల తర్వాతగానీ శ్రీదేవి బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే 2004లో మాలిని అయ్యర్ అనే టీవీ షో మాత్రం చేసింది. 2012లో మళ్లీ ఇంగ్లిష్ వింగ్లిష్ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత 2015లో పులి, 2017లో మామ్ మూవీస్ చేసింది. కానీ 2018లో 54 ఏళ్ల వయసులోనే ఆమె దుబాయ్ లో ఓ పెళ్లికి వెళ్లి అక్కడే కన్నుమూసింది.
సంబంధిత కథనం