First 1 Crore Movie: దేశంలో తొలిసారి రూ.కోటి వసూలు చేసిన సినిమా ఇది.. పుష్ప కంటే ఎక్కువ టికెట్లు సేల్
First 1 Crore Movie: ఇండియాలో తొలి రూ.కోటి వసూళ్ల మూవీ ఏదో తెలుసా? ఈ సినిమాకు అమ్ముడుపోయిన టికెట్లు అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప కంటే ఎక్కువ కావడం విశేషం. ఆ సినిమా వివరాలేంటో చూడండి.

First 1 Crore Movie: ఇండియాలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ మూవీస్, ఎవర్ గ్రీన్ మూవీస్ అనగానే అందరికీ షోలే, మొఘల్-ఇ-ఆజం, దంగల్, పుష్ప 2, బాహుబలి 2లాంటి సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే వీటిన్నింటి కంట ముందే ఓ మూవీ దేశంలో అన్ని రికార్డులను తిరగరాసింది. ఎప్పుడో 80 ఏళ్ల కిందటే ఈ మూవీ రూ.కోటి వసూలు చేసి సంచలనం సృష్టించడం విశేషం.
రూ.కోటి వసూలు చేసిన మూవీ ఇదే
ఇండియాలో రూ.కోటి వసూలు చేసిన తొలి సినిమా పేరు కిస్మత్ (Kismet). జ్ఞాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. 1943లో ఈ సినిమా రిలీజైంది. అశోక్ కుమార్, ముంతాజ్ శాంతి, షా నవాజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ అప్పట్లో ఓ బాక్సాఫీస్ సంచలనం. నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోను తొలిసారి పరిచయం చేసిన సినిమా ఇది.
ఈ మూవీలో అశోక్ కుమార్ ఓ జేబు దొంగలా నటించడం విశేషం. ఆ తర్వాత ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోల సినిమాలు ఇండియాలో చాలానే వచ్చాయి. మొన్నమొన్నటి పుష్ప 2 కూడా ఇంచుమించు అలాంటిదే. కిస్మత్ మూవీ 82 ఏళ్ల కిందటే రూ.1.6 కోట్లు వసూలు చేసింది.
కిస్మత్.. రికార్డు స్థాయిలో టికెట్ల అమ్మకం
కిస్మత్ మూవీలో హీరో దొంగ పాత్ర వేయడంతోపాటు పెళ్లి కాకుండానే గర్భవతి అయిన మహిళ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. అది కూడా అప్పట్లో సంచలనమే. అయితే ఈ కిస్మత్ మూవీలోని దేశభక్తి పాటలు కూడా మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి తోడ్పడ్డాయి. కేవలం రూ.2 లక్షల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా రూ.1.6 కోట్లు వసూలు చేసింది. ఒకే థియేటర్లో రూ.12.5 లక్షలు వసూలు చేసిన రికార్డు కూడా ఈ కిస్మత్ పేరిట ఉంది.
మొత్తంగా 3.5 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. అప్పుడే కాదు.. ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్లయిన ఎన్నో సినిమాలు కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. పుష్ప (2 కోట్లు), 3 ఇడియట్స్ (3.2 కోట్లు), ధూమ్ 3 (3.4 కోట్లు), గజిని (2.4 కోట్లు) బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించినా టికెట్ల అమ్మకం విషయంలో కిస్మత్ ను వెనక్కి నెట్టలేకపోయాయి.
కిస్మత్ మూవీ కోల్‌కతాలోని రాక్సీ సినిమా హాల్లో ఏకంగా 184 వారాల పాటు నడవడం విశేషం. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక కాలం ఆడిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఆరేళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. 1949లో రాజ్ కపూర్ నటించిన బర్సాత్ మూవీ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
సంబంధిత కథనం