Fighter day 1 box office collection: ఫైటర్ తొలి రోజు కలెక్షన్లు.. దుమ్ము రేపిన హృతిక్, దీపికా మూవీ
Fighter day 1 box office collection: హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ తొలిసారి కలిసి నటించిన ఫైటర్ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.
Fighter day 1 box office collection: రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు గురువారం (జనవరి 25) థియేటర్లలోకి వచ్చిన ఫైటర్ మూవీ ఊహించినట్లే మంచి వసూళ్లు రాబట్టింది. నిజానికి మూవీ రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన మేర రాలేదు.

అయితే తొలి రోజు మాత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
బాక్సాఫీస్ ఫైటర్
ఫైటర్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. గతేడాది జనవరి 25నే పఠాన్ మూవీతో ఓ వెయ్యి కోట్ల సినిమా అందించిన అతడు.. ఇప్పుడు హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ లతో కలిసి ఓ దేశభక్తి మూవీతో వచ్చాడు. పఠాన్ లో నేలపై ఊపిరి బిగపట్టి చూసే యాక్షన్ సీన్లను తీసిన సిద్ధార్థ్ ఆనంద్.. ఇప్పుడు ఫైటర్ లో గగనతలంలో అలాంటి సీన్లతో దుమ్ము రేపాడు.
తొలి రోజు ఫైటర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపై విజయబాలన్ ట్వీట్ చేస్తూ.. "హృతిక్ రోషన్ ఫైటర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.23.25 కోట్లుగా ఉండగా.. గ్రాస్ రూ.27.43 కోట్లు ఉంది. ఇక విదేశాల్లో రూ.8.61 కోట్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.36.04 కోట్లు రాబట్టింది" అని అన్నాడు.
ఫైటర్ మూవీ ఎలా ఉందంటే?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పని చేసే ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్లు షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్), మినాల్ రాథోడ్ (దీపికా పదుకోన్), గ్రూప్ కెప్టెన్ రాకేశ్ జై సింగ్ (అనిల్ కపూర్)ల చుట్టూ ఈ ఫైటర్ కథ తిరుగుతుంది. కశ్మీరు లోయలో జరుగుతున్న మిలిటెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఎయిర్ డ్రాగన్స్ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ నెలకొల్పుతారు.
దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వాళ్లు ఈ ఎయిర్ డ్రాగన్స్. ఈ సినిమాకు చాలా వరకూ తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా హృతిక నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా.. హృతిక్ పర్ఫార్మెన్స్ వాటిని కనిపించకుండా చేసిందన్నది అభిమానుల మాట. గతంలో హృతిక్ తో కలిసి బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసిన సిద్ధార్థ్ ఆనంద్ మూడోసారి అతనితో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమాను సుమారు రూ.250 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో లీడ్ రోల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కనిపించడం, గగనతలంలో స్టంట్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికితోడు హృతిక్, దీపిక రెమ్యునరేషన్లు కూడా ఎక్కువే. ఫైటర్ మూవీ కోసం హృతిక్ ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేయగా.. దీపికా పదుకోన్ రూ.15 కోట్లు తీసుకోవడం విశేషం.
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. ఫైటర్ మూవీ కోసం రూ.7 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో స్క్వాడ్రన్ లీడర్ గా నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ కూడా రూ.2 కోట్లు అందుకున్నాడు.