Remuneration Issue : హీరోకే రూ.25 కోట్లా.. ఆడకపోతే నిర్మాతల పరిస్థితేంటి?
Bhushan Kumar On Remuneration : హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ మీద చాలా కాలంగా వివాదం ఉంది. కోట్లలో డబ్బులు తీసుకుంటారు. సినిమా ఆడకపోతే.. తర్వాత పరిస్థితి ఏంటని కొంతమంది నిర్మాతలు ప్రశ్నిస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇదే విషయంపై స్పందించారు.
కరోనా మహమ్మారి తర్వాత బాలీవుడ్ సినిమాలు(Bollywood Movies) అంతగా ఆడడం లేదు. సీనియర్ నటీనటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అంత బాగోలేదు.. కానీ కొంత మంది నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోకపోవడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్(Bhushan Kumar) దీనిపై తన స్పష్టమైన వైఖరిని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
నటీనటుల రెమ్యునరేషన్ సమస్య చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఆర్టిస్టులు కోట్లలో డబ్బులు తీసుకుంటారు. సినిమా వసూళ్లలో కూడా వాటా తీసుకునే వారు ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్(Box Office) వద్ద బోల్తా కొడుతుండటంతో నిర్మాతలు భయపడుతున్నారు. దీనిపై భూషణ్ కుమార్ మాట్లాడారు. కొంతమంది నటీనటులకు ప్రస్తుత పరిస్థితి గురించి తెలిసినప్పటికీ, తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరని భూషణ్ అన్నారు. కొంతమంది మాత్రమే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని తెలుసుకొని సానుకూల ఉంటున్నారన్నారు.
'కొంతమంది నటీనటులు మాత్రం అలా లేరు. ఇంత రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటాం.. లేకుంటే సినిమాలో పని చేయనని చెబుతున్నారు. ఇకపై అలాంటి నటీనటులతో పని చేయను. పెద్ద సినిమాల్లో చాలా మంది నష్టపోయారు. కాబట్టి మేం మీకు ఎందుకు చెల్లించాలి? మీరు 20 నుండి 25 కోట్లు తీసుకుంటారు. అప్పుడు మేము నష్టాన్ని ఎందుకు భరించాలి?' అని భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
కొంతమంది హీరోలు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారని భూషణ్ కుమార్ అన్నారు. కొంతమంది మాత్రం అదేమీ పట్టించుకోకుండా వారికి కావాల్సినది ఇవ్వాలని అడుగుతారని తెలిపారు. కుదరకుంటే వెళ్లిపోండని కూడా చెప్తామని భూషణ్ వెల్లడించారు. చిన్న సినిమాలకు కూడా రూ.20 కోట్ల డిమాండ్ చేస్తారని, అంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేనప్పుడు బేరాలు చేస్తామని చెప్పారు.
ఈ విషయంపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం అసహనంగానే ఉన్నాడు. కొంతమంది తారలు మరీ ఎక్కువ మెుత్తాన్ని అడుగుతారని గతంలో చెప్పాడు. భూషణ్ కుమార్ ఇప్పటివరకు చాలా చిత్రాలను నిర్మించారు. ఎందరో దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు. టీ సిరీస్(T Series) అనే కంపెనీ ఉంది. దివంగత గుల్షన్ కుమార్ అతని తండ్రి. 'తుమ్ బిన్' సినిమా నుంచి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.