Family Star First Week Collection: లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా దాటలేకపోయిన ఫ్యామిలీ స్టార్ తొలి వారం వసూళ్లు
Family Star First Week Collection: ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ అయిన లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా ఈ మూవీ వారం రోజుల్లో దాటలేకపోయింది.

Family Star First Week Collection: విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోనుంది ఫ్యామిలీ స్టార్ మూవీ. తొలి రోజు తొలి షో నుంచే వచ్చిన నెగటివ్ టాక్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపై చాలానే ప్రభావం చూపింది. ఈ సినిమా తొలి వారం కలెక్షన్లు విజయ్ మరో డిజాస్టర్ లైగర్ తొలి రోజు సాధించిన కలెక్షన్లను కూడా దాటలేకపోడం గమనార్హం.
ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ గత శుక్రవారం (ఏప్రిల్ 5) రిలీజైన విషయం తెలిసిందే. తొలి ఏడు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. గురువారం (ఏప్రిల్ 11) ఏడో రోజు రంజాన్ పండగ హాలీడే ఉన్నా కూడా ఈ సినిమాకు కేవలం రూ.94 లక్షల కలెక్షన్లే వచ్చాయి.
మూవీ రిలీజైన రోజు నుంచి చూస్తే కనీసం రూ.కోటి వసూళ్లు కూడా దాటకపోవడం ఇదే తొలిసారి. మొత్తంగా తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు రూ.16.83 కోట్లుగా ఉండగా.. తమిళంలో ఏడు రోజుల్లో కలిపి రూ.1.42 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.21.15 కోట్లుగా, ఓవర్సీస్ లో రూ.9.5 కోట్లుగా ఉన్నాయి. తొలి రోజు రూ.5.55 కోట్లతో మొదలైనా.. ఏడో రోజుకు వచ్చేసరికి కోటి కూడా అందుకోలేకపోయింది.
లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్
విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయిన లైగర్ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది. సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ సినిమాకు కూడా తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ తో రెండో రోజు నుంచి క్రమంగా వసూళ్లు తగ్గుతూ వెళ్లాయి.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. భారీ నష్టాలను మిగిల్చింది. ఆ లెక్కన చూసినా.. లైగర్ తొలి రోజు కలెక్షన్లను కూడా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వారం కలెక్షన్లు అందుకోలేకపోయాయి. ఈ మూవీని కూడా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. దీంతో మరో విజయ్ సినిమా నష్టాలను మిగిల్చనుంది. ఇది అతని కెరీర్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం.
వరుసగా లైగర్, ఖుషీ, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఫెయిల్యూర్స్ తో విజయ్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు పనిగట్టుకొని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని మొదట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజుతోపాటు సినిమా యూనిట్ మొత్తం చెప్పినా.. సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చలేదని కలెక్షన్లను చూస్తేనే తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ లేకపోయినా, వరుస సెలవులు ఉన్నా ఈ సినిమా క్యాష్ చేసుకోలేక బోల్తా పడింది.
ఇప్పటికైనా విజయ్ తనపై పగబట్టి నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని చెప్పడం మానేసి కంటెంట్ పై దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.