ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ రావాల్సి ఉంది. ఇంతలోనే మూడో సీజన్‍లో ఓ కీలక పాత్రలో పోషిస్తున్న నటుడు రోహిత్ బస్ఫర్ (27) మరణించారు. అసోంలోని గర్భంగ వాటర్ ఫాల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం రోహిత్ మృతదేహం కనిపించింది. స్నేహితులతో పిక్నిక్‍కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
గువహటిలోని గర్భంగ వాటర్ ఫాల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రోహిత్ బస్ఫర్ ప్రమాదవశాత్తు జారిపడిపోయారని అక్కడి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. తమకు ఈ విషయం తెలిశాక సాయంత్రం 4.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరామని, సాయంత్రం 6.30 గంటల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ టీమ్ మృతదేహాన్ని బయటికి తీసిందని రాణి పోలీస్ ఔట్‍పోస్ట్ అధికారులు చెప్పారు.
రోహిత్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు పంపారు. ఈ కేసుపై విచారణ జరపనున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ సెట్స్‌లో దిగిన ఫొటోలను రోహిత్ గతేడాది నవంబర్ నుంచి చాలాసార్లు తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. జయ్‍దీప్ అహ్లావత్ సహా ఇతర నటీనటులతో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ సిరీస్ బృందంతో దిగిన ఫొటోలను ఈ ఏడాది మొదట్లో షేర్ చేశారు. “ఫ్యామిలీ మ్యాన్ 3 సెట్స్ నుంచి. ఇది నాకు ఓ గొప్ప అనుభవం. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకునేందుకు నేను ఇష్టపడతా” అని క్యాప్షన్ పెట్టారు. అయితే, ఫ్యామిలీ మ్యాన్ 3 రాక ముందే దురదృష్టవశాత్తు కన్నుమూశారు రోహిత్.
రోహిత్ బస్ఫర్ మృతి ప్రమాదం కాదని, హత్య అంటూ అతడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇటీవల పార్కింగ్ విషయంలో కొందరితో రోహిత్‍కు గొడవ జరిగిందని, చంపేస్తామని వారు బెదిరించినట్టు తెలిపారు. ఆ వ్యక్తులే రోహిత్‍ను చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. రోహిత్ శరీరంపై గాయాలు కూడా చూశామని తెలిపారు. కేసు కూడా పెడతామని అన్నారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించున్నాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో మూడో సీజన్ ఈ ఏడాదిలోనే రానుంది. ఈ సిరీల్‍లో మనోజ్ బాజ్‍పేయ్, ప్రియమణి, షరీబ్ హష్మి, దృష్టి తివారి, సుచిత్ర తివారి, జయ్‍దీప్ అహ్లవాత్ ప్రధాన పాత్రలు పోషించారు. మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో ఓటీటీ ప్రకటించాల్సి ఉంది.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1లో నటించిన ఆసిఫ్ బసారా (53).. 2020లో హఠాన్మరణం చెందారు. ధర్మశాలలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‍లో మృతి చెందారు. ఉరికి వేలాడుతూ ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఇప్పుడు, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో నటించిన రోహిత్ బస్ఫర్ జలపాతంలో పడి కన్నుమూశారు.
సంబంధిత కథనం
టాపిక్