Falimy Review: ఫలిమీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చిన ఫుల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎలా ఉందంటే?
Falimy Movie Review In Telugu: ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తాజాగా మలయాళంలో బాగా హిట్ అయిన ఫలిమీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఫ్యామిలీ చుట్టు నడిచే కథతో వచ్చిన ఈ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందో ఫలిమీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఫలిమీ
నటీనటులు: బసిల్ జోసెఫ్, మంజు పిళ్లై, జగదీష్, మీనరాజ్ పల్లురుతి, సందీప్ ప్రదీప్, రైనా రాధాకృష్ణ, బొలోరామ్ దాస్ తదితరులు
రచన: సంజో జోసెఫ్, నితీష్ సహదేవ్
దర్శకత్వం: నితీష్ సహదేవ్
నిర్మాతలు: గణేష్ మీనన్, అమల్ పాల్సన్, లక్ష్మీ వారియర్
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: బబ్లు అజు
ఎడిటింగ్: నిధిన్ రాజ్ అరోల్
రిలీజ్ డేట్: డిసెంబర్ 18, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
Review Of Falimy In Telugu: మలయాళ సినిమాలకు సెపరెట్ క్రేజ్ ఉంటుందన్న విషయంతెలిసిందే. మాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. అలా ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ఫలిమీ. డైరెక్టర్ బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఫలిమీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఫలిమీ రివ్యూలోకి వెళితే..
కథ:
అనూప్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. అతనికి ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే తల్లి, దివాళా తీసిన ప్రెస్‌లో ఎప్పుడూ తాగుతూ ఉండే తండ్రి, చదువు కోసం యూకే వెళ్లేందుకు ప్రయత్నించే తమ్ముడు ఉంటారు. వీరితోపాటు సంధు దొరికితే కాశీకి వెళ్దామనుకునే తాతయ్య కూడా ఉంటాడు. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా కాశీకి వెళ్లేందుకు ప్రయత్నించే తాతయ్యకు ఎప్పుడూ ఎవరో ఒకరు తెలిసిన వాళ్లు ఎదురై ఇంటికి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో అనూప్‌కు పెళ్లి ఫిక్స్ అవుతుంది.
ట్విస్టులు
ఫొటోలు చూసిన మూడు నెలలకు అనూప్‌కు ఆ అమ్మాయి ఓకే చెబుతుంది. పెళ్లయ్యాక తాతయ్యను కాశీకి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తాడు అనూప్. కానీ, ఆ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఆ అమ్మాయితో అనూప్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది?, తాతయ్య కోరికను అనూప్ తీర్చాడా? కాశీకి బయలుదేరిన ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? కాశీకి ఎలా వెళ్లారు? అక్కడ వాళ్ల తాతయ్య ఎందుకు తప్పిపోయాడు? వాళ్ల తాతయ్యను ఆ కుటుంబం కనిపెట్టిందా? వంటి ఆసక్తికర విషయాలతో ఫలిమీ ఉంది.
విశ్లేషణ:
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాశీకి ఎలా వెళ్లి వచ్చిందనేదే ఫమిలీ మూవీ స్టోరి. సినిమాపై ఆసక్తి పెంచేందుకు ఇంగ్లీష్ పదంలోని ఫ్యామిలీని కాస్తా అటు ఇటు మార్చి ఫమిలీగా పెట్టారు డైరెక్టర్. తండ్రి గురించి, కుటుంబం గురించి బాధ్యత లేని తండ్రి. తన తండ్రి ఎలాంటి పని లేకుండా రోజు తాగి నిద్రపోవడం నచ్చని కొడుకు. వీళ్లంతా కలిసి కాశీ ట్రిప్‌కు వెళ్లడం ఎలా ఉంటుందో చూపించారు. సాధారణంగా ఫ్రెండ్స్ అంతా టూర్స్ వేస్తారు. కానీ, ఒకరంటే మరొకరికి పడని ఓ కుటుంబం కాశీకి వెళ్తే ఉంటుందో ఫన్నీగా, కాస్తా ఎమోషన్ డ్రామా యాడ్ చేసి తెరకెక్కించారు.
నవ్విస్తాయి, బోర్ కొట్టిస్తాయి
ముందు పాత్రల పరిచయంతో సినిమా సాగుతుంది. అనూప్‌కు పెళ్లి సంబంధం రావడంతో సినిమా ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఇక పెళ్లి ఆగిపోవడం, తాతయ్యను కాశీకి తీసుకెళ్లడంతో సినిమా ట్రాక్‌లో పడుతుంది. ట్రైన్‌లో వెళ్లాల్సిన కుటుంబం రోడ్ మార్గం ద్వారా వెళ్లే కారణం కామెడీగా ఉంటుంది. ఆ రోడ్డు మార్గంలో వాళ్లు ఎదుర్కునే ఇబ్బందులు నవ్విస్తాయి. కానీ, కొంతవరకు బోర్ కూడా కొట్టిస్తాయి.
కాశీకి ఎందుకు
ఎలాగోలా కాశీకి వెళ్లాక అక్కడ వాళ్లకు చెప్పకుండా తాతయ్య ఎక్కడికో వెళ్లిపోవడం, అతని కోసం కుటుంబ సభ్యులు వెతకడంలో కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. సౌత్ నుంచి చాలా మంది కాశీకి ఎందుకు వస్తారో చెప్పారు. అది కాస్తా హృద్యంగా ఉంటుంది. తమకోసం రాని కుటుంబీకుల కోసం ఎదురుచూసే తాతయ్యలు ఎంతో మంది ఉంటారని ఓ పాత్ర ద్వారా చూపించారు.
నవ్వించే సీరియస్ సీన్స్
కొన్నిసార్లు సీరియస్‌గా సాగే సన్నివేశాలు కూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ బాగుంటుంది. నవ్విస్తుంది. సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. పాటలు కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కాశీని పెద్దగా ఏం చూపించలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకుంటుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
అనూప్ పాత్ర పోషించింది మిన్నల్ మురళి డైరెక్టర్ బసిల్ జోసెఫ్. ఇదివరకు ఆయన జయ జయ జయ జయహే సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి తాను నటుడిగా నిరూపించుకున్నారు. మంజు పిళ్లై, జగదీష్, మీనరాజ్ పల్లురుతి, సందీప్ ప్రదీప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫన్నీగా సాగే ఓ ఫ్యామిలీ ట్రిప్ చూడాలనుకుంటే ఫ్రీ టైమ్‌లో ఫమిలీపై లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.5/5