Thriller Movie: మలయాళం థ్రిల్లర్ సినిమాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ మూవీ మీ కోసమే. పుష్ప మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా పేరు ట్రాన్స్ (Trance). యూట్యూబ్ లో తెలుగులోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉన్న సూపర్ హిట్ మూవీ ఇది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ ట్రాన్స్ (Trance) కూడా ఒకటి. 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించాడు. అతని భార్య నజ్రియా నజిమ్ కూడా ఇందులో నటించడం విశేషం. ఈ మూవీ స్టోరీ కాస్త భిన్నంగా సాగుతుంది. అసలు దేవుడినే నమ్మని ఓ మోటివేషనల్ స్పీకర్.. తన సోదరుడు మరణించిన తర్వాత పాస్టర్ గా మారి తన మాయ మాటలతో ప్రజలను ఎలా మోసం చేస్తాడో ఈ మూవీలో మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.
కన్యాకుమారిలో ఓ చిన్న మోటివేషనల్ స్పీకర్ అయిన విజు ప్రసాద్ ప్రపంచమే మెచ్చే ఓ పెద్ద పాస్టర్ జోషువా కార్ల్‌టన్ గా ఎలా ఎదిగాడు? అతన్ని అడ్డం పెట్టుకొని ఓ కార్పొరేట్ ను నడిపే ఇద్దరు వ్యక్తులు ఎలా కోట్లకు పడగలెత్తారు? చివరికి అతడే వాళ్ల బాగోతం ఎలా బయటపెడతాడనేదే ఈ ట్రాన్స్ మూవీ స్టోరీ.
ట్రాన్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను అన్వర్ రషీద్ డైరెక్ట్ చేశాడు. విన్సెంట్ వడక్కన్ కథ అందించాడు. ఓ నాస్తికుడిని క్రిస్టియన్ పాస్టర్ గా మార్చేసి.. అతని ద్వారా కోట్లు గడించే ఓ నకిలీ ఏజెన్సీ చుట్టూ ఈ ట్రాన్స్ మూవీ కథ తిరుగుతుంది. చిటికెలో రోగాలను మాయం చేసే పాస్టర్లను నమ్మి సాధారణ జనం ఎలా మోసపోతారన్నది ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
అలాంటి పాస్టర్లను జనాలపైకి వదిలే కార్పొరేట్ల బాగోతాన్ని కూడా మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. అసలు దేవుడినే నమ్మని ఓ వ్యక్తి ఆ దేవుడినే అడ్డం పెట్టుకొని కేవలం తన మాటల ద్వారా ప్రపంచమే మెచ్చే ఓ పెద్ద పాస్టర్ గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూడొచ్చు.
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ తన నట విశ్వరూపం చూపించాడు. ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకొని అన్వర్ రషీద్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాను యూట్యూబ్ లో తెలుగులోనూ చూడొచ్చు. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
సంబంధిత కథనం