Facts About Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Facts About Kalki 2898 AD: నాగ్ అశ్విన్ మోస్ట్ అవేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ ఈరోజు (జూన్ 27) థియేటర్లలోకి వచ్చేసింది.ఈ వీకెండ్ లో ఈ సినిమా మీరు చూడాలనుకుంటే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోవాలి.

Facts About Kalki 2898 AD: ప్రభాస్ నటించి, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సైన్స్ ఫిక్షన్, పురాణాల మేళవింపుతో తెరకెక్కిన మూవీ. రానా దగ్గుబాటి చెప్పినట్లు ఇది ఇండియా 'అవెంజర్స్ మూమెంట్'.
ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళ (జూన్ 27) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే.
కల్కి ప్రపంచం ఇదీ..
ఈ కల్కి 2898 ఏడీ ఓ ఊహాజనిత ప్రపంచం. క్రీస్తు శకం 2898లో హిందువుల పవిత్ర నగరం, ప్రపంచంలోని తొలి నగరం కాశీలోని గంగా నది ఎడిపోయి, ప్రజలు నిత్యావసర వనరుల కోసం పోరాడే దుర్భర భవిష్యత్తులో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో నగరం భయానకంగా కనిపిస్తోంది.
అయితే కాంప్లెక్స్ వాసులు మాత్రం అన్ని వనరులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గర్భవతులను కూడా దోచుకుంటున్నట్లు కనిపిస్తోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ కాంప్లెక్స్ వాసుల దురాగతాలను అడ్డుకోవడానికి, అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి శంబాలా శరణార్థి శిబిరం ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఈ కల్కిలో ప్రభాస్ పాత్ర ఇదీ..
కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో ప్రభాస్ నటించాడు. అతనికి ప్రతి పనిలో సహకరించే బుజ్జి అనే ఏఐ కారు సాయంతో ప్రభాస్ తన పనులు పూర్తి చేస్తుంటాడు. కాశీని వదిలి కాంప్లెక్స్ కు వెళ్లి హాయిగా బతికేయాలన్నది అతని టార్గెట్ గా ఉంటుంది.
బుజ్జిని ఇలా తయారు చేశారు..
కల్కి 2898 ఏడీ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న బుజ్జి అనే సూపర్ కారును చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, కోయంబత్తూర్ లోని జయం ఆటోమోటివ్స్ సంయుక్తంగా తయారు చేశారు. ఇది రెండు మహీంద్రా ఇ-మోటార్లతో పనిచేస్తుంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ వాహనం కస్టమైజ్డ్ టైర్లు, బ్రేకింగ్ సిస్టం కలిగి ఉందని, ఒక్కో వాహనానికి రూ.4 కోట్లు ఖర్చవుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
మహాభారతానికి లింకు
గుర్గావ్ లో జరిగిన సినాప్సే 2024 కార్యక్రమంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ చిత్రం మహాభారతంతో మొదలై కలియుగంలో ముగుస్తుందని అన్నారు. ''మా సినిమా మహాభారతంలో మొదలై 2898లో ముగుస్తుంది. ఆ సినిమా పేరు కల్కి 2898 ఏడీ. ఇది 6000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగే స్టోరీ. ఆయా ప్రపంచాలను క్రియేట్ చేయడం, అవి ఎలా ఉంటాయో ఊహించుకోవడం, అలాగే అందులో మన భారతీయతను అలాగే ఉంచడానికి ప్రయత్నించాం" అని నాగ్ అశ్విన్ చెప్పాడు.
అశ్వత్థామ శాపం
కల్కి 2898 ఏడీ మూవీకి అశ్వత్థామ కథ కీలకంగా అనిపిస్తుంది. ఈ మూవీలో ఈ పాత్ర సుమతి, ఆమెకు పుట్టబోయే బిడ్డకు హాని జరగకుండా కాపాడుతుంది. అశ్వత్థామకు కృష్ణుడి శాపం ఉంది. అదేంటంటే తగిలిన గాయాలతో రక్తం, చీము కారుతూ కలియుగం ముగిసే వరకూ అడవుల్లో సంచరిస్తూనే ఉండాలని. తన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తరుని పుట్టబోయే బిడ్డ వైపు తిప్పి పాండవుల వంశాన్ని అంతమొందించడానికి ప్రయత్నించినందుకు తన తలపై ఉన్న రత్నాన్ని కూడా ఇచ్చేయాల్సి వచ్చింది. అలాంటి అశ్వత్థామ పాత్రకు కల్కి 2898 ఏడీ ఎంతో కొంత మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.