Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?
Escape Room 2 Movie Review In Telugu: ఇటీవల ఓటీటీలోకి అనేక రకాల జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో సర్వైవల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా ఎస్కేప్ రూమ్ 2. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో ఎస్కేప్ రూమ్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
Escape Room 2 Review In Telugu: సైకలాజికల్, సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమా ఎస్కేప్ రూమ్. 2019 సంవత్సరంలో వచ్చి మంచి ఆదరణ పొందిన ఈ సినిమాకు 2021లో సీక్వెల్ తెరకెక్కించారు. అడమ్ రబిటెల్ దర్శకత్వం వహించిన ఈ ఎస్కేప్ రూమ్: టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ (Escape Room: Tournament of Champions) ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ (Netflix OTT) ఓటీటీలో తెలుగులో విడుదలైంది.
విడుదలైన తొలి రోజు నుంచే ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చిన ఎస్కేప్ రూమ్ 2 (Escape Room 2 Movie) మూవీలో టేలర్ రస్సెల్, లోగన్ మిల్లర్, ఇసాబెల్లె ఫుహర్మాన్న్, డెబోర అన్ వోల్, ఇండియా మూర్, హాలండ్ రోడెన్, జె ఎల్లీస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక డెత్ గేమ్ ట్రాప్‌లో పడిన ఆరుగురు వ్యక్తుల కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఎస్కేప్ రూమ్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఎస్కేప్ రూమ్ సినిమాలో జరిగిన కథ చెబుతూ ఎస్కేప్ రూమ్ 2 స్టార్ట్ అవుతుంది. డెత్ గేమ్ నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జోయీ డేవిస్ (టేలర్ రస్సెల్), బెన్ మిల్లర్ (లోగన్ మిల్లర్) ప్రాణాలతో బయటపడతారు. ఈ గేమ్‌లో తన స్నేహితులు చనిపోవడాన్ని తలుచుకుని బాధపడతారు. దీనంతటికి కారణమైన మినోస్ అనే సంస్థ లేదా వ్యక్తిని పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. ఈ గేమ్ ఆడేందుకు ఉపయోగించే కొన్ని కోడ్స్ సహాయంతో మెక్సికోలోని ఓ ప్రాంతానికి వెళ్తారు జోయీ, బెన్.
అక్కడ అనుకోకుండా ఒక మెట్రో ట్రైన్‌లో చిక్కుకుంటారు. కానీ, అది మినోస్ వేసిన ట్రాప్ అని తెలుసుకుంటారు. ఆ ట్రైన్‌లో వారితోపాటు ఇదివరకు డెత్ గేమ్ ఆడి ప్రాణాలతో బయటపడిన మరో నలుగురు ఉండటంతో షాక్ అవుతారు. ఆ ఆరుగురు మరోసారి ప్రాణాలు కాపాడుకునేందుకు పజిల్స్ సాల్వ్ చేయడంతో సినిమా కథలోకి వెళ్తుంది.
మరి ఈసారి డెత్ గేమ్ నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? ఆ ఆరుగురికి ఉన్న గతం ఏంటీ? డెత్ గేమ్ వల్ల వారు ఎలాంటి మానసిక స్థితికి లోనయ్యారు? అసలు మినోస్ ఎవరో తెలిసిందా? అతన్ని జోయీ, బెన్ పట్టుకున్నారా? విమానం అంటే భయపడే జోయీ ఫ్లైట్ జర్నీ చేసిందా? చివరికీ ఏమైంది? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే ఎస్కేప్ రూమ్ 2 చూడాల్సిందే.
విశ్లేషణ:
ముందుగా చెప్పినట్లు మొదటి పార్ట్ ఎస్కేప్ రూమ్‌లో ఏం జరిగింది, జోయీ, బెన్ ఎలా బయటపడ్డారనే విషయాలతో రెండో పార్ట్ ప్రారంభం అవుతుంది. తర్వాత వారి మెంటల్ కండిషన్ స్తిమితంగా చేసుకోవడం, తమ స్నేహితులను బలి తీసుకున్న వారిపై రివేంజ్ తీసుకునేందుకు ఇద్దరు మెక్సికోకు వెళ్లడంతో సినిమా కథలోకి వెళ్తుంది. అసలు ప్రారంభ సన్నివేశం నుంచే మూవీ పరుగులు పెడుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా పాత్రల పరిచయం, కథ తెలిసిపోతుంది.
ఇదివరకు గెలిచి ప్రాణాలతో బయటపడిన ఛాంపియన్స్‌ను తమకు తెలియకుండానే మరోసారి డెత్ గేమ్‌లో పార్టిస్‌పేట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ అనే టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అయింది. ఈ సెకండ్ పార్ట్‌లో కూడా పజిల్స్ అవి బాగున్నాయి. దానికి కావాల్సిన సెటప్, సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. మొదటి పార్ట్‌లాగే ఉండటం అది చూసినవారికి రిపీట్ మోడ్‌లో చూసినట్లు అనిపిస్తుంది.
ఇందులో కూడా ఎవరు చనిపోతారు, ఎవరు బతుకుతారు అనేది ఊహించలేం. మధ్యలో వచ్చే ట్విస్ట్ పర్వాలేదు. క్లైమాక్స్ బాగానే ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశం కూడా చాలానే ఉంటుంది. మూడో పార్ట్ కూడా తీసే ఆలోచన ఉన్నట్లుగా క్లైమాక్స్ ఉంటుంది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, సెటప్ అన్ని బాగున్నాయి. కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ఉంటాయి సీన్స్. నటీనటులు పర్ఫామెన్స్ బాగుంది. తమ పాత్రల్లో బాగా జీవించేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే గంటన్నర నిడివి ఉన్న ఎస్కేప్ రూమ్ 2 ఇలా చూస్తుంటే అలా అయిపోతుంది. గ్రిప్పింగ్‌గా, బోర్ కొట్టకుండా, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా సాగుతుంది. రెండో పార్ట్ కోసం మొదటి పార్ట్ కచ్చితంగా చూడాల్సిన అవసరం లేదు. రెండో పార్ట్ ప్రారంభంలో మొదటి పార్ట్‌లో ఏం జరిగిందో చూపించారు.
Escape Room Tournament of Champions Review Telugu: ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేందుకు, కొన్ని పాత్రల కోసం చూడాలనుకుంటే ఫస్ట్ పార్ట్ చూసి రెండో పార్ట్ చూడొచ్చు. ఎలాంటి బోల్డ్ సీన్స్ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
టాపిక్