Emergency Box Office Collection: ఎమర్జెన్సీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవీ.. కంగనా ఈసారైనా గట్టెక్కుతుందా?
Emergency Box Office Collection: ఎమర్జెన్సీ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. కంగనా రనౌత్ గత రెండు సినిమాలతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉన్నా.. ఈ మూవీతో అయినా ఆమె గట్టెక్కుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
Emergency Box Office Collection: కంగనా రనౌత్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, 1975లో ఆమె దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం (జనవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ సినిమాకు రూ.2.35 కోట్లు వచ్చాయి. కంగనా గత రెండు సినిమాలతో పోలిస్తే ఇవి కాస్త మెరుగైన వసూళ్లే అని చెప్పొచ్చు.
ఎమర్జెన్సీ బాక్సాఫీస్ వసూళ్లు
కంగనా రనౌత్ గత ఐదేళ్లలో సోలో లీడ్ గా నటించిన సినిమాలు తేజస్, ధాకడ్. ఈ రెండు మూవీస్ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. వాటితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఎమర్జెన్సీ తొలి రోజు వసూళ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎమర్జెన్సీ మూవీ తొలి రోజు రూ.2.35 కోట్లు వసూలు చేసింది.
అదే 2023లో వచ్చిన తేజస్ రూ.1.25 కోట్లు, 2022లో వచ్చిన ధాకడ్ రూ.1.2 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. 2021లో తలైవి మూవీ రూ.1.46 కోట్లు రాబట్టింది. 2020లో వచ్చిన పంగా మూవీ మాత్రమే ఎమర్జెన్సీ కంటే మెరుగ్గా తొలి రోజు రూ.2.7 కోట్లు వసూలు చేయడం విశేషం.
తొలి రోజే ఈ ఎమర్జెన్సీ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు రాబడుతుందన్న నమ్మకం లేదు. ఈ సినిమాను రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
ఎమర్జెన్సీ మూవీ ఎలా ఉందంటే?
కంగనా రనౌత్.. ఇందిరా గాంధీ పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆ టైమ్‌లో ఇందిరపై ఎందుకు విమర్శలు వచ్చాయి? ఇందిరా గాంధీ ప్రభుత్వం పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయనే అంశాలను ఈ సినిమా ద్వారా కంగనా చూపించే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విషయంలో నటిగా మాత్రం కంగనా అదరగొట్టింది. ఆమె లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇందిరాగాంధీని గుర్తుచేసింది. ఇందిరా గాంధీ రోల్ కోసం కంగాన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కానీ దర్శకురాలిగా మాత్రం తబబడిపోయింది. చాలా వరకు జనాలకు తెలిసిన అందుబాటులో ఉన్న సమాచారంతోనే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించినట్లు అనిపించింది. యాక్టింగ్ పరంగా సినిమాలో వంక పెట్టడానికి ఏం లేదు. కంగనా రనౌత్‌తో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే, విషాక్ నాయర్.. ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. వారి లుక్స్, కాస్ట్యూమ్స్ నుంచి లోకేషన్స్ వరకు 1970 నాటి కాలాన్ని రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించారు.