Pradeep | ఏం మాయ చేసావే ఫేమ్ ప్రదీప్ కొట్టాయం మృతి.. జార్జ్ అంకుల్‌గా గుర్తింపు
మలయాళ నటుడు ప్రదీప్ కొట్టాయం మృతి చెందారు. గుండెపోటుతో మరణించిన ఆయన కేరళలో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ఏం మాయ చేసావే చిత్రంలో జార్జ్ అంకుల్ పాత్రలో కనిపించారు.
మలయాళ చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కమెడియన్ ప్రదీప్ కొట్టాయం కేరళలో కన్నుమూశారు. 61 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో ఆయన చనిపోయారు. ఆయన మృతిపై మాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా నివాళలు అర్పిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో ఆయన నటించారు.
మలయాళ స్టార్ హీరో ప్రృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ప్రదీప్ కొట్టాయం తన కెరీర్‌లో 70కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో కనిపించారు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత నటించిన ఏమాయ చేసావే సినిమాలో జార్జ్ అంకుల్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అంతేకాకుండా రాజా రాణి చిత్రంలోనూ ఓ పాత్ర పోషించారు.