Elections Results 2024: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.. ఈ సిటీల్లో బుకింగ్స్ కూడా షురూ
Elections Results 2024 Live in Theatres: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల హీట్ ఉండనుంది. ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ ఇచ్చేందుకు కొన్ని థియేటర్లు రెడీ అయ్యాయి. కొన్ని నగరాల్లో ఈ ఎలక్షన్ స్పెషల్ షో ఉండనుంది. ఆ వివరాలివే..
Elections Results 2024 in Theatres: దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం నేటి (జూన్ 1)తో సమాప్తం కానుంది. ఈ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ నేడు ముగియనుంది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు, ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఈసారి కొన్ని సినిమా థియేటర్లు కూడా ఎన్నికల ఫలితాల లైవ్‍ను ప్రదర్శించనున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని నగరాల్లో టికెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆ వివరాలివే..
ఈ సిటీల్లో..
ఎలక్షన్ రిజల్ట్స్ 2024 పేరుతో ఈ ఫలితాల లైవ్‍ను జూన్ 4న కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రదర్శించనున్నాయి. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, పుణె నగరాల్లో ఈ ఎలక్షన్ షోల కోసం థియేటర్లలో టికెట్ల ఆన్‍లైన్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల ఫలితాల లైవ్‍ను ఏ థియేటర్లయినా ప్రదర్శిస్తాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల లైవ్ కోసం థియేటర్ల కేటాయింపు లేదు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, పూణెలో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ షోలు ఉన్నాయి.
టైమింగ్స్, టికెట్ రేట్లు ఇలా..
జూన్ 4న ఎన్నికల ఫలితాల లైవ్ షో థియేటర్లలో 6 గంటల పాటు ఉండనుంది. ఉదయం 9 గంటలకు ఇది మొదలవుతుంది. ముంబై, ఢిల్లీ, పుణెలో ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ అయిన థియేటర్లలో ఈ ఎలక్షన్ షో టికెట్ ధరలు రూ.99 నుంచి రూ.300 మధ్య ఉన్నాయి.
కారణాలివేనా!
ప్రస్తుతంలో బాలీవుడ్‍లో రిలీజ్‍లు పెద్దగా లేవు. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం ఈ వారం రిలీజైంది. ఇది తప్ప మరే మూవీ రన్ ఆశాజనకంగా లేదు. దీంతో ఈ డ్రై పీరియడ్‍లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందకు కొన్ని థియేటర్లు నిర్ణయించుకున్నాయని అంచనా.
ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి థియేటర్లలో మంచి స్పందన దక్కింది. దీంతో ఎన్నికల ఫలితాల లైవ్ షోలు వేసేందుకు కొన్ని థియేటర్లు ముందుకు వచ్చాయని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ విషయంలో ఆందోళన
ఎన్నికల ఫలితాల లైవ్‍ను థియేటర్లలో ప్రదర్శించడంపై సినీ వర్గాల్లో ఓ ఆందోళన కూడా ఉంది. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన పార్టీల మద్దతుదారులు థియేటర్లను ధ్వంసం చేసే ప్రమాదం కూడా ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వివిధ పార్టీల మద్దతుదారుల మధ్య థియేటర్లలో గొడవలు జరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరి థియేటర్లలో జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రదర్శనకు రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు దశలుగా ఏప్రిల్ 11 నుంచి జూన్ 1వ తేదీ మధ్య జరిగాయి. దేశవ్యాప్తంగా లోక్‍సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా వీటితో పాటే జరిగాయి. జూన్ 4న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.