Ekam OTT: కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి.. ప్రొడ్యూజ్ చేసిన తొలి వెబ్ సిరీస్ ఏకం వెబ్ సిరీస్‍పై ఎట్టకేలకు అప్‍డేట్ వచ్చేసింది. 2021లోనే ఈ కన్నడ సిరీస్ పూర్తిగా సిద్ధమైంది. అయితే, ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆసక్తి చూపకపోవటం సహా మరిన్ని కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ఏడు స్టోరీలతో యాంథాలజీ సిరీస్‍గా ఏకం రూపొందింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, దీని కోసం ఓ సొంత ప్లాట్‍ఫామ్‍ను రక్షిత్ శెట్టి తీసుకొచ్చారు. స్ట్రీమింగ్ డేట్‍ను కూడా వెల్లడించారు.
ఏకం వెబ్ సిరీస్ కోసం సొంతంగా ఓ వెబ్‍సైట్‍తో ప్లాట్‍ఫామ్ తీసుకొచ్చారు రక్షిత్ శెట్టి. www.ekamtheseries.com వెబ్‍సైట్‍లో ఈ సిరీస్ జూలై 13వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని రక్షిత్ శెట్టి నేడు (జూన్ 18) అధికారికంగా వెల్లడించారు. అయితే, ఈ సిరీస్ ఉచితం కాదు.
ఏకం వెబ్ సిరీస్‍ను వెబ్‍సైట్‍లో చూడాలంటే రూ.149 ఫీజు చెల్లించాలి. “ప్రేక్షకులకు మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మేం ఈ ప్లాట్‍ఫామ్‍ను సృష్టించాం. ఇప్పుడు ఏకం సిరీస్‍ను ఒక్క సిరీస్ టికెట్ ధరతోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం” అని ఈ సిరీస్ క్రియేటర్ సుమంత్ చెప్పారు. రూ.149 చెల్లిస్తే ఈ సిరీస్‍తో పాటు కొంత ప్రత్యేకమైన కంటెంట్ కూడా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆ వెబ్‍సైట్‍లో విష్ లిస్ట్‌ను మేకర్స్ అందుబాటులోకి తెచ్చారు.
ఏకం వెబ్ సిరీస్‍లో ప్రకాశ్ రాజ్, రాజ్ బీ శెట్టి, షైన్ శెట్టి సహా మరికొందరు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు సందీప్ పీఎస్, సుమంత్ భట్ క్రియేటర్లుగా ఉన్నారు. పరంవాహ్ స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించారు.
ఏకం స్ట్రీమింగ్ డేట్ ప్రకటన సందర్భంగా రక్షిత్ శెట్టి ఓ నోట్ కూడా పోస్ట్ చేశారు. 2020 ఫిబ్రవరిలోనే ఈ సిరీస్‍ను మొదలుపెట్టినట్టు తెలిపారు. ఆ తర్వాత కరోనా వల్ల కాస్త ఆలస్యమైందని అన్నారు. 2021 అక్టోబర్‌లోనే ఏకం ఫైనల్ కట్ చూశానని వెల్లడించారు. ఈ సిరీస్ చూసిన తాను చాలా థ్రిల్ అయ్యానని పేర్కొన్నారు. అయితే, ఈ సిరీస్‍ను ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకోలేదనేలా రాసుకొచ్చారు. ఈ సిరీస్ అందరూ చూడాలనే ఉద్దేశంతో తానే సొంతం ఓ ప్లాట్‍ఫామ్ తీసుకొచ్చామని తెలిపారు. ఈ సిరీస్ అందరినీ నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు రక్షిత్ శెట్టి.
ఏకం వెబ్ సిరీస్ కన్నడలో మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇతర భాషల డబ్బింగ్ గురించి మేకర్స్ ఏమీ ప్రస్తావించలేదు. మరి సొంత వెబ్‍సైట్ తీసుకొచ్చి వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్న రక్షిత్ శెట్టి కొత్త స్ట్రాటజీ ఎంత వర్కౌట్ అవుతుందో వేచిచూడాలి.
రక్షిత్ శెట్టి ప్రస్తుతం రిచర్డ్ ఆంటోనీ అనే సినిమా చేస్తున్నారు. తానే దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు. 777 చార్లీ, సప్తసాగరాలు దాచే ఎల్లో (తెలుగులో సప్తసాగరాలు దాటి) సినిమాలతో రక్షిత్ శెట్టికి వేరే భాషల్లోనూ మంచి పాపులారిటీ వచ్చింది.