Eesha Rebba: ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పి మోసం చేశారు: ఈషా రెబ్బ
Eesha Rebba: నటి ఈషా రెబ్బా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీపై చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో తనను హీరోయిన్ అని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె కామెంట్స్ ఉన్నాయి.
Eesha Rebba: టాలీవుడ్ నటి ఈషా రెబ్బ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీపై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ సినిమాలో తనను హీరోయిన్ అని చెప్పి, తర్వాత తన సీన్లను మొత్తం కట్ చేసేశారని ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నిరాశ వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పీరియడ్స్ సమయంలో నటించడంపైనా స్పందించింది.
సెకండ్ హీరోయిన్ చెప్పినా బాగుండేది: ఈషా
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ గా నటించింది. అయితే ఈ సినిమా స్టోరీ మొత్తం త్రివిక్రమ్ తనకు చెప్పాడని, ఫిమేల్ లీడ్స్ లో ఒకరిగా ఉంటానని మాటిచ్చినట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా వెల్లడించింది.
చివరికి చూస్తే సినిమాలో తాను నటించిన సీన్లన్నింటినీ కత్తిరించేశారని చెప్పింది. "నేను వెకేషన్ లో ఉన్నా కూడా త్వరగా ముగించుకొని రావాలని చెప్పారు. త్రివిక్రమ్ నాపై ఓ పాట కూడా చిత్రీకరించారు. సినిమా కోసం నేను హార్లీ డేవిడ్‌సన్ బైక్ నడపడం కూడా నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ ఫైనల్ వెర్షన్ లో నా సీన్లన్నింటినీ కట్ చేసేశారు" అని ఈషా వెల్లడించింది.
"నన్ను టీమ్ కనీసం సెకండ్ లీడ్ హీరోయిన్ గా అనౌన్స్ చేసినా నేను హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. నా క్యారెక్టర్ నిడివి చాలా తక్కువగా ఉందని, అసలు ఏమాత్రం ప్రభావం చూపలేదని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు" అని ఈషా తెలిపింది.
పీరియడ్స్‌లో షూటింగ్ నరకమే..
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఈషా పీరియడ్స్ సమయంలో షూటింగ్ చేయడం ఎంత ఇబ్బందో కూడా చెప్పింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడతానని, కొన్నిసార్లు అర్థం చేసుకునే డైరెక్టర్లు ఉంటే వాళ్లకు సమస్య చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటానని తెలిపింది. పీరియడ్స్ లో ఉన్నా షూటింగ్ లో పాల్గొనడం తప్పదని, రోజంతా తన కోసం వాయిదా వేయరని ఈషా చెప్పింది.
కొన్నిసార్లు తాను పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ షూటింగ్ లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నట్లు ఆమె వివరించింది. ప్రస్తుతం ఈషా పలు తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా ఈషా రెబ్బ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆమెకు ఇప్పటి వరకూ చెప్పుకోదగిన విజయం మాత్రం దక్కలేదు. ఇక ఓటీటీలోనూ 3 రోజెస్, పిట్ట కథలు, మాయా బజార్ ఫర్ సేల్, దయాలాంటి వెబ్ సిరీస్ లలోనూ ఈషా నటించింది. దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా ఈ ఏడాది చివర్లో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆమె అలివేలు అనే పాత్రలో కనిపించింది.