Bollywood: చనిపోయే ముందు హీరోకు రూ.72కోట్ల ఆస్తి రాసిచ్చేసిన డైహార్డ్ ఫ్యాన్.. రియాక్ట్ అయిన స్టార్.. వివరాలివే
Bollywood: బాలీవుడ్ సీనియర్ హీరో సంజత్ దత్‍కు ఓ మహిళ ఏకంగా రూ.72కోట్ల ఆస్తి ఇచ్చారు. చనిపోతూ ఆయనకు ఆ ఆస్తి చెందాలని రాశారు. దీనిపై సంజయ్ దత్ కూడా స్పందించారు.

సినీ స్టార్ హీరోలకు అభిమానగణం అధికంగా ఉంటుంది. తన అభిమాన నటుడి కోసం ఏమైనా చేస్తామనేలా డైహార్డ్ అభిమానులు కూడా ఉంటారు. బాలీవుడ్ సీనియర్ హీరోకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయనంటే అమితంగా అభిమానిస్తారు. అయితే, ఓ మహిళా అభిమాని మాత్రం ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా ఆస్తినే రాసిచ్చేశారు. చనిపోతూ రూ.72కోట్ల విలువైన ఆస్తి సంజయ్‍కు దక్కాలంటూ వీలునామా రాశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఎవరు ఈ అభిమాని!
ముంబైకు చెందిన నిషా పాటిల్ (62) అనే మహిళ సంజయ్ దత్‍కు వీరాభామాని. ఆమెనే చనిపోయే ముందు ఆయనకు రూ.72కోట్ల ఆస్తిని రాసిచ్చారు. నిషా పాటిల్ ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అయితే, చనిపోయే ముందే బ్యాంకులకు ఆమె కొన్ని లెటర్స్ రాశారట. సంజయ్ దత్‍కే తన డబ్బు బదిలీ చేయాలని తెలిపారని సమాచారం. అలాగే తన ఆస్తి మొత్తం సంజయ్ దత్‍కే చెందుతుందని వీలునామా కూడా రాశారు. లీగల్‍గా ప్రస్తుతం ఆ ఆస్తి అంతా సంజయ్ పేరిట ప్రస్తుతం ఉంది.
ఆశ్చర్యంలో సంజయ్
అభిమాని తన పేరిట రూ.72కోట్ల ఆస్తి రాశారని తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యపోయారు. తనకు నిషా పాటిల్ ఎవరో కూడా తెలియదని, కానీ ఆమె తన కోసం చేసిన పని పట్ల ఆయన కదిలిపోయారు. అయితే, తాను ఆస్తిని తీసుకోకూడదని సంజయ్ నిర్ణయించుకున్నారు.
తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం
తాను ఆస్తులను తీసుకోనని, నిషా కుటుంబ సభ్యులకు తిరిగి ఇచ్చేయాలని సంజయ్ డిసైడ్ అయ్యారు. ఇందులో తన లీగల్ టీమ్‍ను కూడా రంగంలోకి దింపారు. నిషా కుటుంబ సభ్యులకు ఆ ఆస్తి దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. “నేను ఏదీ తీసుకోవాలని అనుకోవడం లేదు. నిషా ఎవరో నాకు తెలియదు. ఈ విషయం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు” అని సంజయ్ దత్ చెప్పారు.
ఖల్నాయక్, సాజన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, వాస్తవ్, నామ్, ధమాల్ సహా సంజయ్ నటించిన చాలా బాలీవుడ్ చిత్రాలు బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. ఆయన నటన, అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. జీవితంలోనూ చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు సంజయ్. ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాల ఆరోపణలతో జైలుకు వెళ్లి బయటికి వచ్చారు. మరిన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఇలా చాలా ఒడిదొడుకులను చూశారు సంజయ్. ప్రస్తుతం ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తున్నారు. లియో, కేజీఎఫ్ 2, డబుల్ ఇస్మార్ట్స్ సహా పాటు మరిన్ని దక్షిణాది చిత్రాల్లో విలన్‍గా కనిపించారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు.
సంబంధిత కథనం